Begin typing your search above and press return to search.

జగన్ కు షాక్... "ఉండాల్సింది గుడ్ బుక్ కాదు.. గుండె బుక్"!

ఈ ఏడాది వైసీపీకి వరుసపెట్టి బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి! ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం..

By:  Tupaki Desk   |   23 Oct 2024 7:23 AM GMT
జగన్  కు షాక్... ఉండాల్సింది గుడ్  బుక్  కాదు.. గుండె బుక్!
X

ఈ ఏడాది వైసీపీకి వరుసపెట్టి బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి! ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం.. దాని నుంచి కోలుకునేలోపు పలువురు రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు పార్టీకి బై బై చెప్పేసిన పరిస్థితి. ఈ విషయంలో చాలా మంది నేతలు క్యూలో ఉన్నారని.. ముహూర్తం కోసం చూస్తున్నారని.. మరికొంతమంది అవతలి పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం చూస్తున్నారని అంటున్నారు.

అయినప్పటికీ జగన్ తన ధీమాలో తాను ఉన్నట్లు చెబుతున్నా.. ఈ జంపింగ్ పర్వాలు చినికి చినికి గాలివానగా మారి పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యలో తాజాగా వైసీపీ నేత, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆమె రాజీనామాకు సంబంధించిన ఓ లేఖ వైరల్ గా మారింది.

అవును... వైసీపీకి మరో షాక్ తగిలిందనే చెప్పాలి. ఇందులో భాగంగా... ఆ పార్టీ మహిళా నేత, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆమె.. తాజాగా అధికారికంగా పార్టీకి దూరం జరిగారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను వైసీపీ కార్యాలయానికి పంపించారు.

ఈ సందర్భంగా ఆమె జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... పార్టీని నడిపించడంలో జగన్ కి బాధ్యత లేదని.. పరిపాలన చేయడంలోనూ బాధ్యత లేదని.. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని విమర్శించారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడిని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని అన్నారు.

వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీలో పనిచేసినట్లు తెలిపారు. అయితే... ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలను సమీక్షించుకుని, అంతర్మధనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఇటీవల ప్రస్థావించిన "గుడ్ బుక్"పై సెటైర్లు పేల్చారు వాసిరెడ్డి పద్మ!

ఇందులో భాగంగా... నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది "గుడ్ బుక్" కాదని, "గుండె బుక్" అని పద్మ కామెంట్ చేశారు. ఇదే సమయంలో.. ప్రమోషన్ అనే పదం వాడటానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదని.. పార్టీకోసం ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్ "గుడ్ బుక్" పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని ఫైర్ అయ్యారు!

కాగా.. వాసిరెడ్డి పద్మ రాజీనామాకు జగ్గయ్య పేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పోస్టే కారణం అని అంటున్నారు. గత ఎన్నికల్లో జగ్గయ్య పేట టిక్కెట్ ఆశించిన ఆమెకు.. అవకాశం దక్కలేదు! ఇటీవల జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఆ పోస్ట్ ఖాళీ అవ్వడంతో ఆమె ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.

అయితే ఇటీవల జగ్గయ్య పేట ఇన్ ఛార్జ్ గా తన్నీరు నాగేశ్వర రావుని నియమించారు జగన్. ఈ నేపథ్యంలోనే వాసిరెడ్డి పద్మ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలొ.. ఈ నిర్ణయం వెనుక వైఎస్ షర్మిళ మోరల్ సపోర్ట్ కూడా ఉందని.. పద్మ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు!!