Begin typing your search above and press return to search.

‘పేట’ సీటు పద్మకేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మార్పులుచేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Jan 2024 12:30 PM GMT
‘పేట’ సీటు పద్మకేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొందడమే లక్ష్యంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మార్పులుచేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలో ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌ సభా కలిపి మొత్తం 68 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. ఇందులో 58 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 10 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.

ఇప్పటివరకు నాలుగు విడతల్లో అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైఎస్‌ జగన్‌ ఐదో విడత జాబితాను మరికొద్ది రోజుల్లో విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలను, టికెట్లు ఆశిస్తున్న ఆశావహులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు పిలిపించుకుని జగన్‌ మాట్లాడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో కొత్త అభ్యర్థి పోటీ చేయడం ఖాయమని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా కాపు సామాజికవర్గానికి చెందిన సామినేని ఉదయభాను ఉన్నారు. ఈయన 1999, 2004ల్లో జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు.

కాపు సామాజికవర్గానికి చెందిన ఉదయభానును మంత్రివర్గంలోకి తీసుకుంటారని వైసీపీ అధికారంలోకి రాగానే వార్తలు వినిపించాయి. అయితే ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేయరన్న కారణంతోనే ఆయనను వైఎస్‌ జగన్‌ పక్కనపెట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. రెండోసారి మంత్రివర్గ విస్తరణ అప్పుడు కూడా ఇదే కారణంతో ఉదయభానుకు మంత్రి పదవి దక్కలేదని టాక్‌ నడిచింది. కాపుల్లో ఆయన కంటే చాలా జూనియర్లకు, తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచినవారికి కూడా జగన్‌ మంత్రులుగా చాన్సు ఇచ్చినా ఉదయభానును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.

ఇక ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పక్కనపెట్టొచ్చని గట్టిగా ప్రచారం జరుగుతోంది. జగ్గయ్యపేట నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన వాసిరెడ్డి పద్మను బరిలోకి దింపుతారని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం వాసిరెడ్డి పద్మ ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గా ఉన్నారు.

వైఎస్‌ జగన్‌ తాజాగా వాసిరెడ్డి పద్మను కూడా తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసుకు పిలిపించి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఆమె అభిప్రాయాలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో అదే సామాజికవర్గానికి చెందిన, అందులోనూ మహిళ అయిన వాసిరెడ్డి పద్మకు సీటు ఇస్తే ప్రయోజనం ఉండొచ్చని జగన్‌ భావిస్తున్నట్టు సమాచారం.

జగ్గయ్యపేట సీటును వాసిరెడ్డి పద్మకు కేటాయిస్తే విజయవాడ తూర్పు సీటును సామినేని ఉదయభానుకు ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు విజయవాడ తూర్పు ఇంచార్జిగా దేవినేని అవినాశ్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాశ్‌ ను దించాలా లేక సామినేని ఉదయభానును దించాలా అనేదానిపై జగన్‌ తీవ్ర కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు. సామినేని ఉదయభానును పూర్తిగా పక్కనపెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగ్గయ్యపేట సీటుపై త్వరలోనే జగన్‌ నిర్ణయం వెలువడుతుందని చెబుతున్నారు.