Begin typing your search above and press return to search.

మద్యం కేసు సీఐడీ అదుపులో వాసుదేవరెడ్డి?

మూడు రోజుల క్రితం సీఐడీ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 7:21 AM GMT
మద్యం కేసు సీఐడీ అదుపులో వాసుదేవరెడ్డి?
X

ఏపీలోని లిక్కర్ స్కాంలో బెవరేజస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సీఐడీ అదుపులోకి తీసుకున్నట్ల సమాచారం. మూడు రోజుల క్రితం సీఐడీ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హైదరాబాద్లోని రహస్య ప్రదేశంలో వాసుదేవరెడ్డిని విచారణ పేరుతో వేధిస్తున్నారని, ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు బెవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా వాసుదేవరెడ్డి పనిచేశారు. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారే ఫిర్యాదులతో ఎన్నికల సంఘం ఆయనను విధుల నుంచి తప్పించింది. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే వాసుదేవరెడ్డి తన పోస్టుకు రాజీనామా చేశారు. విజయవాడలోని తన కార్యాలయం నుంచి కొన్ని ఫైళ్లు తరలిస్తున్నట్లు ఓ ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదుతో ఆయనను అదుపులోకి తీసుకుని, హైదరాబాద్ నానక్ రామగూడలోని ఆయన ఇళ్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత రాష్ట్రం మద్యం స్కాంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో వాసుదేవరెడ్డి అండర్ గ్రౌండ్లోకి వెళ్లారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆగష్టులో వాసుదేవరెడ్డిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, అప్పట్లో సీఐడీ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చింది. కానీ, మూడు రోజుల క్రితం వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా సీఐడీ పోలీసులు స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దల పేర్లు చెప్పించాలని వాసుదేవరెడ్డిపై సీఐడీ ఒత్తిడి చేస్తోందని, ఆయన భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయని వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఏపీలో 2019-24 మధ్య ప్రభుత్వమే మద్యం క్రయ, విక్రయాలు జరిపింది. ఇందులో సుమారు 99 వేల కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలు జరిగాయన, సుమారు 60 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. రకరకాల బ్రాండ్లను తీసుకువచ్చి, కమీషన్ ఇచ్చిన కంపెనీల మద్యాన్నే అమ్మించారని వాసుదేవరెడ్డిపై అభియోగాలు ఉన్నాయి.