"రాజే" యోగం ఉన్నట్లా.. లేనట్టా..?
ఎడారి రాష్ట్రం రాజస్థాన్ కు రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఘనత వసుంధరా రాజేది. ఆ రాష్ట్రంలో పార్టీపై గట్టి పట్టు కూడా ఉంది.
By: Tupaki Desk | 8 Dec 2023 11:41 AM GMTఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు ఆరు రోజులు అవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేశారు.. దీంతోపాటే ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. అక్కడ ఇప్పటికే సీఎంలుగా పనిచేసిన నాయకులూ ఆ పార్టీకి ఉన్నారు. కానీ, ఇంకా మూడు రాష్ట్రాల సీఎంలు ఎవరో తేల్చలేకపోతోంది ఆ పార్టీ. మరీ ముఖ్యంగా రాజస్థాన్ విషయంలో.
రాజే సరే.. ఆమె అహంకారమే..
ఎడారి రాష్ట్రం రాజస్థాన్ కు రెండుసార్లు సీఎంగా పనిచేసిన ఘనత వసుంధరా రాజేది. ఆ రాష్ట్రంలో పార్టీపై గట్టి పట్టు కూడా ఉంది. కానీ, గతంలోలా రాజేను సీఎం చేసేందుకు బీజేపీ అధిష్ఠానం సిద్ధంగా లేనట్లు స్పష్టమవుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వసుంధరా రాజే వ్యవహార శైలిపై సదభిప్రాయం లేకపోవడమే దీనికి కారణం. మరోవైపు రాజస్థాన్ లో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి గెలిచారు. వీరిలో కొందరిని సీఎం పదవికి పోటీదారులుగా భావిస్తున్నారు. అనుభవం, మహిళ కావడం.. వసుంధర రాజేకు కలిసి వచ్చే అంశాలు. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందోననే ఉత్కంఠ నెలకొంది. అందుకే సీఎం ఎంపికపై విస్తృత సమావేశాలు జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రుల పోటీ..
కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘవాల్ సహా ఓం ప్రకాష్ మాథుర్, బాబా బాలక్‌నాథ్ వంటి వారి పేర్లు కూడా రాజస్థాన్ సీఎంగా తెరపైకి వస్తున్నాయి. దీంతో రాజే కుమారుడు దుష్యంత్ ను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం అయ్యారు. అనంతరం రాజే, దుష్యంత్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. వారి ముఖంలో మాత్రం చిరునవ్వు కనిపించింది. దీంతో రాజస్థాన్ సీఎం పీఠం రాజేకే దక్కొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి.
రాజేకు సొంతంగా ఇవ్వరు..
పాలనను పూర్తిగా రాజే చేతుల్లో పెట్టకుండా.. రాజస్థాన్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దుష్యంత్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనా తన కుమారుడిని రిసార్ట్‌లో బంధించారని కిషన్ గంజ్ బీజేపీ ఎమ్మెల్యే లలిత్ మీనా తండ్రి హేమ్ రాజ్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఉంచారనే వార్తలు బయటికి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలను వసుంధరా ఖండించారు. మధ్యప్రదేశ్ లో కొంత సమయం తీసుకున్నా.. మరోసారి శివరాజ్ సింగ్ చౌహాన్ కే పదవి కట్టబెట్టొచ్చు. లేదంటే కేంద్ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను సీఎం చేయొచ్చు. వసుంధరా రాజే.. జ్యోతిరాదిత్యకు స్వయానా మేనత్త కావడం గమనార్హం. కాగా, ఛత్తీస్ గఢ్ లో మాత్రం రమణ్ సింగ్ పేరే వినిపిస్తోంది.