కొడాలి, వంశీ వెళ్లిపోవాలి.. రోజా మాటలు తగ్గించాలి : వైసీపీ నేత సంచలన కామెంట్స్
అదేవిధంగా మాజీ మంత్రి రోజా మాటలు ఆడేటప్పుడు ఆచితూచి నడుచుకోవాలని అన్నారు.
By: Tupaki Desk | 13 Feb 2025 2:20 PM GMTవైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో కొందరు నేతల తప్పుడు సమాచారం వల్లే పార్టీ ఓడిపోయిందని చెప్పారు. ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెటుగా చేసుకోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయిందని చెప్పిన వాసుపల్లి.. విజయసాయిరెడ్డి మాదిరిగా పార్టీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా పార్టీని వీడి వెళ్లిపోతే మంచిదన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి రోజా మాటలు ఆడేటప్పుడు ఆచితూచి నడుచుకోవాలని అన్నారు.
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి పార్టీని వీడటం శుభసూచకమన్న వాసుపల్లి.. ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం వల్లే ఉత్తరాంధ్రలో పార్టీ ఓడిపోయిందన్నారు. పార్టీ కార్యకర్తల సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన సాయిరెడ్డి.. పార్టీకి సమస్యగా మారారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన మిస్ గైడ్ చేశారని చెప్పారు. సాయిరెడ్డి వల్లే రుషికొండ ప్యాలెస్ కట్టాల్సివచ్చిందని అన్నారు. కొడాలి నాని, వంశీ పార్టీకి డేంజర్ గా తయారయ్యారని ఫైర్ అయ్యారు. జగన్ లండన్ వెళ్లి సాయిరెడ్డిని బయటకు పంపారని చెప్పారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
మాజీ మంత్రి రోజా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. వ్యక్తిగతంగా ఎవరినీ టార్గెట్ చేయొద్దన్నారు. 9 నెలలుగా కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నామని, ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదన్నారు. ఎవరు ఎంత మందిని పెళ్లి చేసుకుంటే మనకెందుకని? వ్యక్తిగతంగా విమర్శించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
వల్లభనేని వంశీ అరెస్టు అయిన సమయంలో వాసుపల్లి చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 2019లో టీడీపీ తరఫున గెలిచిన వాసుపల్లి గణేశ్.. మధ్యలోనే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న ఆయన సొంత పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. పార్టీకి రీజనల్ కో ఆర్డినేటర్లు అవసరమే లేదని చెప్పిన ఆయన అధినేత జగన్ కు నేతలకు మధ్య మరో వ్యవస్థ ఉండకూడదని సూచించారు. మొత్తానికి వాసుపల్లి కామెంట్స్ కాకరేపుతున్నాయి. దీనిపై ఆ పార్టీ ఎలా స్పందిస్తున్నది చూడాల్సివుంది.