వలస నాయకులు నెత్తికెక్కుతున్నారా... ఎమ్మెల్యే అసహనం
వలస నాయకుల కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని కూడా వాసుపల్లి గర్జించారు.
By: Tupaki Desk | 26 July 2023 7:37 PM GMTవిశాఖ అంటేనే సిటీ ఆఫ్ డెస్టినీ గా చెబుతారు. విశాఖ కు ఎవరు వచ్చినా వెనక్కి వెళ్లరు. ఇక ఉద్యోగ వ్యాపార నిమిత్తం వచ్చిన వారు పని లో పని గా రాజకీయాల్లోకి దిగిపోయి ఉన్నత పదవులు అందుకున్న చరిత్ర ఉంది. విశాఖ లోనే ఇలా జరుగుతోంది. దీని మీద అందరికీ అసంతృప్తి ఉంది. స్థానిక నాయకులు ఎదగలేకపోతున్నారు.
రాజకీయ పార్టీలు చూస్తే వలస నాయకులకే పెద్ద పీట వేస్తున్న నేపధ్యం ఉంది. దీంతో ఇపుడు వైసీపీ తో ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడుతున్నారు. విశాఖ నెత్తికెక్కి వలస నాయకులు ఉన్నారని ఆయన ఫైర్ అయ్యారు. విశాఖవాసుల మంచితనం వల్లనే ఇలా జరుగుతోందని కూడా అంటున్నారు.
వలస నాయకుల కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని కూడా వాసుపల్లి గర్జించారు. ఇంతకీ వాసుపల్లి ఈ విధంగా మండిపడడానికి కారణాలు ఉన్నాయి. ఆయన విశాఖ సౌత్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి గెలిచారు. వైసీపీ లోకి వచ్చారు.
అయితే ఆయన కు విశాఖ సౌత్ లో వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దాంతో మండిపడిన ఆయన ఇదంతా వలస నాయకుల పనే అంటున్నారు మరి అలాంటి నాయకులు ఎవరు వారు వైసీపీ లో ఉన్నారా లేక టీడీపీ వారి మీద వాసుపల్లి ఈ కామెంట్స్ చేశారా అన్నది అర్ధం కావడం లేదు.
వాసుపల్లి గణేష్ కుమార్ అయితే తాను హ్యాట్రిక్ ఎమ్మెల్యేని అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. తనకు ఎపుడో జగన్ టికెట్ ఖరారు చేశారని అన్నారు. ఆ విషయాన్ని పదే పదే వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకటించారని గుర్తు చేశారు.
అధికార పార్టీ అందునా మళ్లీ 2024లో కచ్చితంగా మరోమారు అధికారం లోకి వచ్చే పార్టీ అంటే చాలా మందికి మక్కువ ఉంటుందని, టికెట్ కోసం పోటీ ఉంటుందని వాసుపల్లి అంటున్నారు. అలాగని తన సీటు విషయం లో మాత్రం ఎవరికీ ఇచ్చేది లేదని తానే పోటీ చేస్తానని మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాను అని జగన్ మరోసారి సీఎం అవుతారు అని చెప్పుకొచ్చారు.
వాసుపల్లి గతం లో కూడా వలస నాయకులు అంటూ విమర్శించారు. అనేక మార్లు ఆయన ఈ ప్రస్తావన తెస్తున్నారు. అయితే విశాఖ లో టీడీపీ వైసీపీ మాత్రమే కాదు బీజేపీలోనూ వలస నాయకులు ఉన్నారు. జనసేన లో ఇటీవల చేరిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా వలస నాయకుడే. ఇలా చాలా మంది విశాఖ లోనే ఉంటూ రాజకీయం చేస్తున్నారు. మరి ఎవరి మీద వాసుపల్లి ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారో కానీ విశాఖ లో దీని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.