వట్టి వారసుడు.. ఏ పార్టీ నుంచి?
ఏపీ రాజకీయాల్లో మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే కసరత్తులు మొదలెట్టారు. దివంగత నేత వట్టి వసంత్ కుమార్ అన్న కొడుకు వట్టి పవన్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది.
By: Tupaki Desk | 30 July 2023 11:21 AM GMTఏపీ రాజకీయాల్లో మరో వారసుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటికే కసరత్తులు మొదలెట్టారు. దివంగత నేత వట్టి వసంత్ కుమార్ అన్న కొడుకు వట్టి పవన్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన ఉంగుటూరులో వట్టి కుటుంబానికి గట్టి పట్టుంది. ఇక్కడ నుంచి వసంత్ కుమార్ 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. మంత్రిగానూ పనిచేశారు. కానీ ఆ తర్వాత టీడీపీతో కాంగ్రెస్ అవగాహనను వ్యతిరేకిస్తూ వసంత్ కుమార్ రాజకీయాలకు దూరమయ్యారు. 2023 జనవరిలో ఆయన అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఆయన రాజకీయ వారసుడు ఎవరనే చర్చకు తెరలేసింది. ఇప్పుడు దీనికి సమాధానంగా పవన్ కుమార్ ముందుకు వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్న పవన్ కుమార్ ఆ దిశగా కసరత్తులు మొదలెట్టారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ కుటుంబానికి పట్టున్న గ్రామాల్లో తిరుగుతూ.. సమస్యల గురించి అడుగుతున్నారు. అయితే ఆయన ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడా నియోజకవర్గంలో వైసీపీ నుంచి వాసుబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ నుంచి వీరాంజనేయులు, జనసేన ఇంఛార్జీ ధర్మరాజు కూడా బలంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఎంట్రీతో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.