విషాదం: వరుస ప్రమాదాలు.. ఒకే రోజు 26 మంది మృతి.. ఏం జరిగింది?
ఇక, బుధవారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ఏకంగా 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
By: Tupaki Desk | 23 Jan 2025 3:59 AM GMTకర్ణాటక, మహారాష్ట్రలో ఒకే రోజు జరిగిన రెండు ప్రమాదాలు.. ఏకంగా 26 మంది ప్రాణాలు తీశాయి. వీటిలో ఒకటి రోడ్డు ప్రమాదం కాగా.. రెండోది రైలు ప్రమాదం. ఈ రెండు ఘటనలు.. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించాయి. రోడ్డు ప్రమాదం విషయానికి వస్తే.. ఏపీలోని మంత్రాలయానికి చెందిన వేద విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి ఓ వాహనంలో బయలు దేరారు. అయితే.. వీరు వెళ్తున్నవాహనం బుధవారం తెల్లవారు జామున కూరగాయల లోడుతో వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది వేద విద్యార్థుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఇక, బుధవారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ఏకంగా 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఇది రైలు భద్రతను ప్రశ్నార్థకంగా మార్చింది. లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్ ప్రెస్.. మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా మీదుగా పరుగులు పెడుతున్న సమయంలో ఏసీ బోగీకి నిప్పు అంటుకుందన్న ప్రచారం జరిగింది. దీంతో సాధారణ బోగీల్లోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో రైలును నిలిపివేసేందుకు చైన్‌ను లాగడంతో రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు బోగీలు దిగి.. పట్టాల వెంట పరుగులు పెట్టారు. కానీ, ఇదే వారి ప్రాణాలు తీసింది.
పక్కనే ఉన్న మరో పట్టాలపై బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ దూసుకు వచ్చింది. దీంతో పుష్పక్ రైలు నుంచి ప్రాణాలు కాపాడుకోవాలన్న తొందరలో ప్రయాణికులు పరుగులు పెట్టడంతో కర్ణాటక ఎక్స్‌ప్రెస్.. వారిపై నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ఛిద్రమైపోయారు. మరింత మంది ఆసుపత్రికి తీసుకువెళ్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన రైలు భద్రతపై అనేక సందేహాలను వ్యక్తం చేసింది. అగ్నిప్రమాదం సంభవిస్తే.. తమ ప్రాణాలకు భద్రత లేకుండా పోతుందన్న ఆందోళనే ప్రయాణికుల ప్రాణాలు తీసిందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహంతో పాటు ప్రయాణికుల దయనీయ పరిస్థితిపై ఆవేదన వ్యక్తమవుతున్నాయి. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం ప్రకటించారు. కానీ, రైల్వే శాఖపై వస్తున్న విమర్శలను మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా, మృతి చెందిన వారిలో కూలీలు, రోజు వారి కార్మికులు, విద్యార్థులు ఉన్నారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.