Begin typing your search above and press return to search.

కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..!

ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 9:30 AM GMT
కాళేశ్వరం విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..!
X

తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యమంటూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. లక్ష ఎకరాలకు ఏమో కానీ.. కనీసం ఒక్క ఎకరానికి సైతం ప్రాజెక్టు నీరందించలేక చతికిలపడింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాజెక్టు పిల్లర్స్ కుంగిపోవడం కలకలం రేపింది.

ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులోని లోపాలను గుర్తించి విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జితో కమిషన్‌ను ఏర్పాటుచేసింది. దీంతో గత కొన్ని నెలలుగా కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. అప్పటి ప్రభుత్వంలోని నీటి పారుదల శాఖ అధికారులను, ఐఏఎస్‌లను విచారించింది. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ఆరా తీసింది. ఒక పొలిటికల్ లీడర్లను మినహాయిస్తే అప్పటి ప్రభుత్వంలో భాగస్వాములుగా అందరు అధికారులను విచారిస్తూ వస్తోంది. ఈఎన్సీతో సహా సీఈ తదితర చీఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను ఎంక్వయిరీ చేసింది.

ఇదే క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ కమిషన్ పీసీ ఘోష్ ఎదుట మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాలను వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైన్లకు కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం లేదని వెల్లడించారు. ఏ ప్రాజెక్టు నిర్మించాలన్నా ముందుగా సరైన ఇన్వెస్టిగేషన్లు జరగాలని, ఆ ఫలితాల ఆధారంగానే డిజైన్లు చేసి నిర్మాణం జరగాల్సి ఉందని తెలిపారు. కానీ.. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో ఇవేమీ జరగలేదని చెప్పారు. కాళేశ్వరం అనుమతుల కోసం కేంద్ర జలవనరుల సంఘానికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ రాసిన లేఖను సాక్ష్యంగా గతంలో శ్రీరామ్ సమర్పించారు. ఆ లేఖలో భారీగా వ్యత్యాసాలు ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. దాంతో శ్రీరామ్‌ను విచారణకు పిలిచింది. ఏ అధికారంలో అధికారిక పత్రాలను సంపాదించారని ప్రశ్నించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంగా సంపాదించినట్లు వెల్లడించారు. అవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లే అంటూ ఆన్సర్ ఇచ్చారు. డిజైన్లకు అవసరమైన వివరాలను అప్పటి ప్రభుత్వం సీడీఓకు ఇవ్వలేదని చెప్పారు.

వెదిరె శ్రీరామ్ ఇంకా చెప్పారంటే.. నిర్మాణం తరువాత ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ పనులు జరగలేదని తెలిపారు. 2019లో వరదలు తగ్గుముఖం పట్టిన తరువాత మేడిగడ్డ బ్యారేజీ దిగువ భాగంలో సీసీ బ్లాకులు చెల్లాచెదురైనట్లు గుర్తించామన్నారు. వాటిని అప్పుడే సరిచేయాల్సి ఉండగా.. అలా చేయలేదని తెలిపారు. ఈ విషయమై నిర్మాణ సంస్థ, అధికారుల మధ్య చర్చలు జరిగినా పనులు చేపట్టలేదని చెప్పారు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నివేదిక ప్రకారం మూడు బ్యారేజీల్లోనూ ఓఅండ్ఎం నిధులు వెచ్చించిన దాఖలాలు లేవని, పునాదుల నుంచి ఇసుకంతా జారి మేడిగడ్డ కుంగిందన్నారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీలు ఏర్పడినట్లు తెలిపారు. ప్రతిపాదిత ప్రదేశాలకు 2.2 కిలోమీటర్ల దూరంలో సుందిళ్ల, 5.4 కిలోమీటర్ల దూరంలో అన్నారం బ్యారేజీని నిర్మించినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ఒకచోట జరిగితే.. బ్యారేజీలు మరోచోట జరిగాయన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత సీడబ్ల్యూసీ చెప్పినా అప్పటి సీఎం నిర్ణయం మేరకే తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టలేదని తెలిపారు. డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించడానికి ముందే బ్యారేజీల నిర్మాణం ప్రారంభించినట్లు శ్రీరామ్ తెలిపారు.

రుణ సమీకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు కనిపించిందని శ్రీరామ్ తెలిపారు. కార్పొరేట్ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు రుణం తీసుకున్నారని.. కానీ ప్రాజెక్టు నుంచి వస్తున్న లాభాలు మాత్రం శూన్యం అని తెలిపారు. తాను జలశక్తి సలహాదారుగా పనిచేస్తున్నానని, కాళేశ్వరానికి సంబంధించిన పలు మీటింగ్సులో పాల్గొన్నానని, ఆ హోదాలోనే సీడబ్ల్యూసీ నుంచి లేఖ తీసుకున్నానని తెలిపారు. శ్రీరామ్‌తోపాటే ఎమ్మెల్సీ కోదండరామ్‌ను సైతం కమిషన్ విచారించింది. అఫిడవిట్ దాఖలు చేసే విధానం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తొందరపాటుతో కాళేశ్వరం కట్టారని, ఇది తెలంగాణ గుదిబండగా మారిందని కోదండరామ్ తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో తన పాత్ర లేదని, కొంత కాలం మాత్రమే నీటిపారుల శాఖ బాధ్యతలు చూశానని రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు.