కేరళ సీఎం కుమార్తెపై `జగన్` తరహా కేసు.. విచారణకు కేంద్రం ఆర్డర్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి. వీణను అక్రమ లావాదేవీల కేసులో విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు మోడీ సర్కారు తాజాగా అనుమతి ఇచ్చింది.
By: Tupaki Desk | 6 April 2025 12:30 AMకేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు-2024ను కొన్ని పార్టీలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకంగా ఉంది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా వారినే టార్గెట్ చేస్తూ.. కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణ కేంద్రంగా ఇప్పుడు పావులు కదులుతున్నాయి. ఆమెను విచారించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం సంచల నంగా మారింది. దీనిపై కమ్యూనిస్టులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వలేదనే తమను వేధిస్తు న్నారని సీఎం పినరయి విజయన్ కూడా ఆరోపించడం గమనార్హం.
ఏం జరిగింది?
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టి. వీణను అక్రమ లావాదేవీల కేసులో విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థకు మోడీ సర్కారు తాజాగా అనుమతి ఇచ్చింది. వాస్తవానికి ఈ కేసు ఏడాదిన్నర కిందట నుంచి నలుగుతోంది. అయితే.. ఇప్పుడు అనుమతి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 32 ఏళ్ల వీణ.. ఐఐటీ చేసి.. ప్రస్తుతం ‘ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్’ పేరుతో ఐటీ సేవల సంస్థను నిర్వహిస్తున్నారు. తిరువనంతపురం, బెంగళూరు, చెన్నైలో దీనికి శాఖలు ఉన్నాయి. ఈ సంస్థ అవినీతికి పాల్పడిందనేది ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలోనే.. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎస్ ఎఫ్ ఐవో.. గతంలో కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఇది నానుతూనే ఉంది. కానీ, తాజాగా కేంద్రం నుంచి విచారణకు, ప్రత్యేకంగా వీణను విచారించేందుకు అనుమతి లభించడం గమనార్హం.
కేసు ఏంటంటే..
వీణ నిర్వహిస్తున్న ‘ఎక్స్‌లాజిక్ సొల్యూషన్స్’ సంస్థ కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ నుంచి 2 కోట్ల 70 లక్షల రూపాయలను బదలాయించుకుంది. ఇది 2021-22 మధ్య జరిగింది. అయితే.. ఇలా సొమ్ము తీసుకున్నందుకు.. సదరు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ సంస్థకు వీణ నిర్వహిస్తున్న కంపెనీ నుంచి ఎలాంటి సేవలు అందలేదు. దీంతో ఇది అక్రమ బదలాయింపులని.. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఆమె సంపాయించుకున్నారన్నది అధికారులు చెబుతున్న ఆరోపణ. కొచ్చిన మినరల్స్ సంస్థకు పినరయి విజయన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
ఇలా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే సదరు సంస్థ 2 కోట్ల 70 లక్షలను ఆయన కుమార్తె కంపెనీకి బదలాయించిందన్నది విపక్ష బీజేపీ చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే తాజాగా కేసు విచారణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గతంలో ఉమ్మడి ఏపీలో నూ వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. ఆయన కుమారుడు జగన్ ఆస్తులు సంపాయించుకున్నారన్న అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. ఆ కేసులు ఇంకా తేలలేదు. ఇప్పుడు కేరళ సీఎం కుమార్తెపై దాదాపు ఇదే కేసు నమోదు కావడం గమనార్హం. అయితే.. కేంద్రం నిర్ణయాన్ని వామపక్షాలు తప్పుబడుతున్నాయి. వక్ఫ్‌కు అనుకూలంగా లేము కాబట్టే తమను వేధిస్తున్నారన్నది వారి వాదన.