Begin typing your search above and press return to search.

విమానాశ్రయం పేరు సరిగ్గా చెప్పలేదని ఫ్లైట్‌ లో బీజేపీ నేత ఆగ్రహం!

ఈ సందర్భంగా విమానయాన సంస్థకు ఈ మేరకు సూచనలు చేస్తూ, కేంద్రపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ విషయంపై దృష్టి సారించాలని ట్వీట్ చేశారు

By:  Tupaki Desk   |   5 March 2024 8:19 AM GMT
విమానాశ్రయం పేరు సరిగ్గా చెప్పలేదని ఫ్లైట్‌ లో బీజేపీ నేత ఆగ్రహం!
X

విమానాశ్రయం పేరును సరిగ్గా చెప్పలేదంటూ తాను ప్రయాణిస్తున్న విమానంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అందుకు తోటి ప్రయాణికుల మద్దతును తీసుకున్నారు బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్. ఈ సందర్భంగా విమానయాన సంస్థకు ఈ మేరకు సూచనలు చేస్తూ, కేంద్రపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ విషయంపై దృష్టి సారించాలని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విమానంలో తీసిన వీడియోను పోస్ట్ చేశారు.

అవును... బీజేపీ నేత సునీల్ దేవ్ ధర్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా విమానాశ్రయం పేరును సరిగ్గా చెప్పాలంటూ ఇండిగో విమానయాన సిబ్బందికి సలహా ఇచ్చారు! ఇదే సమయంలో ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఇండిగో సంస్థకు ఫిర్యాదు చేస్తున్నారు.. ఇందులో భాగంగా విమానాశ్రయం పేరును స్పష్టంగా ప్రకటించాలని కోరారు.

ఈ విమానాశ్రయం పేరు "వీర్ సావర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్" అని ఫ్లైట్ అటెండెంట్ తో చెబుతున్న సునీల్ దేవ్ ధర్... ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని చెప్పినట్లుగానే... అండమాన్ రాగానే సావర్కర్ జీ పేరును చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా... మీరంతా నా అభిప్రాయంతో అంగీకరిస్తున్నారా అని తోటి ప్రయాణికులను ప్రశ్నించాగా.. వారంతా తమ అంగీకారాన్ని తెలిపారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో స్పందించిన దేవ్ ధర్... "విమానం ఢిల్లీకి చేరుకోగానే ఇందిరా గాంధీ పేరుతో ప్రకటన చేస్తారు. హైదరాబాద్ రాగానే రాజీవ్ గాంధీ పేరు చెబుతారు. కానీ... పోర్ట్ బ్లెయిర్ చేరుకున్నప్పుడు వీర్ సావర్కర్ పేరున ఎందుకు అనౌన్స్ చేయరు" అని ప్రశ్నించారు.

దీంతో ఈ పోస్ట్ పై పలురకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. "మంచి పాయింట్ లేవనెత్తారు సునీల్ జి" అని ఒకరంటే... "ఎందుకంటే.. సావర్కర్ బ్రిటిష్ వారితో కుమ్మక్కయ్యాడు! భారతదేశం కోసం ఒక్క యుద్ధం కూడా చేయలేదు! అతను తన తోటి దేశస్థుల కోసం బెత్తం, బుల్లెట్ తీసుకోవడానికి ధైర్యం చేయని పిరికి వ్యక్తి" అని మరొకరు స్పందించారు!!