వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ స్థానంలో కొత్త విధానం!
ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ స్థానంలో కొత్తగా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని కేంద్రం తెస్తోందని అంటున్నారు
By: Tupaki Desk | 11 Feb 2024 5:59 AM GMTవాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. గతంలో హైవేలపైన ప్రయాణించేవారు చాలా సమయం హెచ్చించి టోల్ ప్లాజాల దగ్గర ఆగి మాన్యువల్ టోల్ చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. ఆ తర్వాత ప్రయాణాలను మరింత సులువు చేయడానికి మాన్యువల్ టోల్ చార్జీల స్థానంలో ఆటోమేటిక్ టోల్ వసూలు చేసేలా ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చారు.
ఈ ఫాస్టాగ్ విధానంలో వాహనదారులు రీచార్జ్ చేసుకుని ఉండాలి. అందులో సరిపోయినంత మొత్తం ఉండాలి. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ఎక్కువ సమయం ఆగకుండా వెళ్లిపోవచ్చు. మాన్యువల్ చార్జీలు చెల్లించడంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానంలో కొంత మేర ప్రయోజనం ఉంది.
అయితే ఫాస్టాగ్ విధానంలో ప్రతిసారీ రీచార్జ్ చేసుకోవడం, తగినంత బ్యాలెన్స్ ఉండటం అవసరం. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, లో బ్యాలెన్స్ అలర్ట్స్ వంటివాటితో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణాలను మరింత సులువు చేయడానికి, వాహనదారులకు అనవసరమైన తలనొప్పిని తగ్గించడానికి కేంద్రం ఫాస్టాగ్ విధానంలోనూ మార్పులు చేస్తోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ స్థానంలో కొత్తగా జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ఆధారిత టోల్ కలెక్షన్ విధానాన్ని కేంద్రం తెస్తోందని అంటున్నారు. జీపీఎల్ టోల్ సిస్టమ్ ను దేశంలో ఇప్పుడిప్పుడే ఎంపిక చేసిన రహదారుల్లో పరీక్షిస్తున్నారు.
జీపీఎస్ టోల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను ప్రత్యేక కెమెరాల ద్వారా ఇది స్కాన్ చేస్తుంది. ఈ కెమెరాలు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి. ఈ విధానంలో వాహన రిజిస్ట్రేషన్ కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి టోల్ మొత్తం చెల్లించబడుతుంది. ఫాస్టాగ్ తో పోల్చితే జీపీఎల్ టోల్ సిస్టం మెరుగైందని అంటున్నారు.
జీపీఎస్ టోల్ సిస్టమ్ ను అమలు చేస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం ఉండదంటున్నారు. అలాగే వాహనాల వేగాన్ని కూడా తగ్గించాల్సిన పని ఉండదని చెబుతున్నారు. దీంతో ప్రయాణ సమయం ఆదా అవుతుందని పేర్కొంటున్నారు. ఫాస్టాగ్ మాదిరిగా రీచార్జ్, బ్యాలెన్స్ గురించిన సమస్యలు ఉండబోవని అంటున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణాలు సాధ్యమని చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్యలకు కూడా దీంతో అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొంటున్నారు. అయితే జీపీఎస్ టోల్ సిస్టం వచ్చినంత మాత్రాన ఫాస్టాగ్ ఏమీ పనికిరాకుండా పోదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో జీపీఎస్ టోల్ సిస్టంను దేశంలో ముందుగా ప్రధాన జాతీయ రహదారుల్లో అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత దేశమంతా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలనే యోచనలో ఉందని సమాచారం.