చంద్రబాబు పోతే పవన్ తపన ఇదే... వెల్లంపల్లి కీలక వ్యాఖ్యలు!
ఇందులో భాగంగా ఎవరికి వారే సంకెళ్లు వేసుకుని ఐదు నిమిషాల పాటు నిరసన తెలిపారు! దీంతో తాజాగా ఈ కార్యక్రమంపై వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.
By: Tupaki Desk | 16 Oct 2023 5:23 PM GMTఏపీలో ఎన్నికలకు ఇంకా సుమారు ఐదారు నెలలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎన్నికల సందడి ఇప్పటినుంచే మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటినుంచీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ ఉన్న అనంతరం జనసేన అధినేత పొత్తు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పారు. ఈ సమయంలో బాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు గత మూడు వారాలుగా ప్రతీ వీకెండ్ కి ఒక కార్యక్రమం ప్లాన్ చేస్తున్న సంగతీ తెలిసిందే. ఇందులో భాగంగా "మోత మోగిద్దాం", "కాంతి క్రాంతి" వంటి కార్యక్రమాలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో... "న్యాయానికి సంకెళ్లు" అనే కార్యక్రమాన్ని తాజాగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎవరికి వారే సంకెళ్లు వేసుకుని ఐదు నిమిషాల పాటు నిరసన తెలిపారు! దీంతో తాజాగా ఈ కార్యక్రమంపై వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఇందులో భాగంగా... తప్పుచేసిన టీడీపీ నేతలకు ఆ సంకెళ్లు పర్మినెంట్ గా పడతాయని తెలిపారు!
అవును... చంద్రబాబుకు ఆల్రెడీ సంకెళ్లు పడ్డాయి, తమకు కూడా సంకెళ్లు వేయండి అన్నట్లుగా టీడీపీ నేతలు ముందుకు వచ్చారని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో టీడీపీలో ఎవరు అవినీతి చేసినా అలా సంకెళ్లు వేసి తీసుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఐదు నిమిషాల నిరసన కార్యక్రమం అని ప్రకటించినా కూడా స్పందన కరువవుతుందని ఎద్దేవా చేశారు!
అనంతరం పవన్ కల్యాణ్ పైనా వెల్లంపల్లి తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇందులో భాగంగా... చంద్రబాబు 7691 ముద్రవేసుకుని కోర్టు పరిధిలో ఉంటే ప్రభుత్వానికి ఏమి సంబంధం ఉంటుంది అని ప్రశ్నించిన ఆయన... ఈ సమయంలో ఆయన విషయంలో ఎలాంటి అనుమానం ఉన్నా, మరెలాంటి అభ్యర్థన చేయాలనుకున్నా కోర్టు దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారు.
ఇప్పటికే ఏసీ కావాలని కోర్టుకి విన్నవిస్తే ఇచ్చారని గుర్తుచేసిన ఆయన... ఒకవేళ ప్రైవేటు వైద్యం కావాలని భావిస్తే దానిపై కూడా కోర్టుకు వెళ్లి అడగాలని సలహా ఇచ్చారు. ఈ విషయంలో ఎందుకు మాట్లాడరు అంటూ పవన్ ని ప్రశ్నించిన ఆయన... షూటింగుల్లో, ఫాం హౌసుల్లో బిజీగా ఉంటావంటూ ఆయనపై సెటైర్లు వేశారు! ఇదే సమయంలో ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఎద్దేవా చేశారు!
ఇదే క్రమంలో... "చంద్రబాబు ఎప్పుడుపోతే అప్పుడు ఆ పార్టీని కలిపేసుకోవచ్చు, మన పార్టీని కలిపేయొచ్చు అని నీ తపన నీది.. నీకు నిజంగా చంద్రబాబు మీద ప్రేమ ఉందా.. ప్రేమ ఉంటే కోర్టుకి వెయ్యి, మెరుగైన వైద్యం అందించండి, ప్రైవేటు వైద్యశాలలో ట్రీట్ మెంట్ ఇప్పించండి అని అడగండి" అని పవన్ కల్యాణ్ కు సూచించారు వెల్లంపల్లి శ్రీనివాస్.
ఇక, ఒకప్పుడు చంద్రబాబు ఉక్కు మనిషి అని, ఆయనది ఉక్కు సంకల్పం అని చెప్పుకున్నారని... ఇప్పుడు నెలరోజులకే ఆ ఉక్కంతా తుక్కైపోయిందని విమర్శించిన వెల్లంపల్లి... చంద్రబాబుకు లేని రోగం లేదని వాళ్ల కుటుంబ సభ్యులే చెప్పుకుంటున్నారన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.