Begin typing your search above and press return to search.

చంద్రబాబు మనసు చూరగొన్న 'నెల్లూరు పెద్దారెడ్డి'

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి

By:  Tupaki Desk   |   2 Aug 2024 7:30 AM GMT
చంద్రబాబు మనసు చూరగొన్న నెల్లూరు పెద్దారెడ్డి
X

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. నెల్లూరు జిల్లాలో బడా కాంట్రాక్టరుగా, ఆర్థికంగా మంచి స్థితిమంతుడు అయిన ఆయన వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సతీమణి ప్రశాంతి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యురాలిగా వ్యవహరించారు.

ఈ క్రమంలో నెల్లూరు లోక్‌ సభకు వైసీపీ అధినేత జగన్‌.. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిని ఎంపీగా ప్రకటించారు. ఈ క్రమంలో నెల్లూరు పార్లమెంటు పరిధిలోని రెండు, మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తాను సూచించిన అభ్యర్థులను పెట్టాలని వేమిరెడ్డి కోరారు. అయితే ఇందుకు జగన్‌ తిరస్కరించారని టాక్‌ నడిచింది. దీంతో తనకు అవమానం జరిగిందని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, తన సతీమణి ప్రశాంతితో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. అలాగే ఆయన భార్య ప్రశాంతి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కాగా టీడీపీలో వేమిరెడ్డికి మంచి గౌరవమర్యాదలు లభిస్తున్నాయని చెబుతున్నారు. చంద్రబాబు ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని.. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి చాలా సంతోషంతో ఉన్నారని అంటున్నారు.

కాగా కేవలం తన నియోజకవర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సేవలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న రెడ్డి సామాజికవర్గ నేతలు కూడా ఈ విషయంలో ఆయనను రోల్‌ మోడల్‌ గా తీసుకుంటున్నారని చెబుతున్నారు.

దంపతులిద్దరూ చేస్తున్న దాతృత్వ సేవతో ఎంతోమంది మనసు చూరగొన్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో వేమిరెడ్డి దాతృత్వానికి ముగ్ధులయిన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు.. వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి కీలక పదవిని కట్టబెడుతున్నారని తెలుస్తోంది. కూటమి పార్టీల తరఫున ఎంతో మంది పోటీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌ పదవిని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఇవ్వబోతున్నారని చర్చ జరుగుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు టీటీడీ చైర్మన్‌ పదవిని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి చంద్రబాబు ఆఫర్‌ చేశారని తెలుస్తోంది. అయితే ఈ పదవికి తాను న్యాయం చేయలేనని.. వ్యాపారంలో బిజీగా ఉంటానని.. ఈ నేపథ్యంలో ఇంకొకరు ఎవరికైనా ఈ పదవిని ఇవ్వాలని ఆయన విన మ్రంగా చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం.

వందలాది మంది పోటీ పడుతున్న టీటీడీ చైర్మన్‌ పదవిని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తిరస్కరించడంతో చంద్రబాబు ఆశ్చర్యపోయారని చెబుతున్నారు. ఆయన వినమ్రతకు చంద్రబాబు ముగ్దులయ్యారని అంటున్నారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తమకు గౌరవ మర్యాదలు తప్ప మరేవీ అవసరం లేదని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి చెప్పారని టాక్‌ నడుస్తోంది. దీంతో చంద్రబాబుకు వేమిరెడ్డిపైన అభిమానం మరింత పెరిగిపోయిందని టాక్‌ నడుస్తోంది.