Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్

తాజాగా.. ఈ కేసు విషయంలో హైకోర్టు కీలక ఘట్టం చోటుచేసుకుంది. రమేశ్‌బాబు పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది.

By:  Tupaki Desk   |   9 Dec 2024 6:55 AM GMT
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్
X

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దశాబ్ద కాలంగా చెన్నమనేని పౌరసత్వంపై కొట్లాడుతూనే ఉన్నారు. తాజాగా.. ఈ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయాల్లో చెన్నమనేని కుటుంబాలే చాలా కీలకం. కోనరావుపేట మండలం నాగారం నుంచి మొదలైన చెన్నమనేని ఫ్యామిలీ రాజకీయ ప్రస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగింది. రాజేశ్వర్‌రావు వారసుడిగా చెన్నమనేని రమేశ్‌బాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వేములవాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రమేశ్‌బాబు పోటీ చేసి ఆది శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఇక అప్పటి నుంచి రమేశ్‌బాబు ఎన్నిక చెల్లదంటూ ఆది శ్రీనివాస్ కొట్లాడుతున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పౌరసత్వం పొందారని హైకోర్టును ఆశ్రయించారు.

2010 జూన్‌లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా రమేశ్‌బాబు పోటీచేశారు. ఈ సందర్భంలోనూ ఆది శ్రీనివాస్ ఎన్నికల కమిషన్‌ను కలిశారు. దాంతో అప్పుడు ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను రిలీజ్ చేయడం నిలిపివేసింది. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఆరు నెలల్లోపు ఎన్నికల నిర్వహించాల్సి అవసరం ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అయిన కూడా ఆది శ్రీనివాస్ పోరాటం చేస్తూనే ఉన్నారు.

2013లో రమేశ్‌బాబు పౌరసత్వాన్ని శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేయగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. 2014 ఎన్నికల్లో మరోసారి రమేశ్‌బాబు గెలుపొందారు. కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టు ఆదేశాలతో 2017లో రమేశ్‌బాబు పౌరసత్వాన్ని రద్దు చేసింది. హోంశాఖ హైకోర్టును సంప్రదించాలని సూచించడంతో.. మళ్లీ హైకోర్టుకు చేరుకుంది. ఇక అప్పటి నుంచి హైకోర్టును వాదనలు నడుస్తూనే ఉన్నాయి. తీర్పు వాయిదా పడుతూ వస్తున్నది.

తాజాగా.. ఈ కేసు విషయంలో హైకోర్టు కీలక ఘట్టం చోటుచేసుకుంది. రమేశ్‌బాబు పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. తప్పుడు పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికయ్యారని కోర్టు వెల్లడించింది. విచారణ సమయంలో తమను తప్పుదోవ పట్టించడంపై రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నష్టపరిహారంగా.. అప్పట్లో ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. నెల రోజుల్లోనే ఈ డబ్బులను ఆది శ్రీనివాస్‌కు చెల్లించాలని వెల్లడించింది. మరో రూ.5 లక్షలను లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.