Begin typing your search above and press return to search.

ఆ జీవో చూసి అభినందించకుండా ఉండలేకపోయిన వెంకయ్య నాయుడు!

అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జీవో లను ఇంగ్లిష్ భాషలో ముద్రించి విడుదల చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   16 July 2024 9:36 AM GMT
ఆ జీవో చూసి అభినందించకుండా ఉండలేకపోయిన వెంకయ్య నాయుడు!
X

“తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స”... అన్నారు శ్రీకృష్ణదేవరాయులు! అయితే... ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గిపోతుందని.. తెలుగులో మాట్లాడటాన్ని చిన్నతనంగా ఫీలవుతున్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ ఆసక్తికరమైన అడుగు వేసింది. దీంతో... అభినందనలు అందుకుంటుంది.

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లో మినహా దాదాపు మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ మాతృభాషకు ఇక్కడితో పోలిస్తే ఎక్కువ గౌరవం దక్కుతుంటుందని.. ప్రభుత్వ జీవీలు ఆయా రాష్ట్రాల మాతృభాషల్లోనే ఉంటాయని చెబుతుంటారు. అప్పుడు వాటిని చదవడం, అర్ధం చేసుకోవడం ఆ రాష్ట్ర ప్రజానికానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం జీవో లను ఇంగ్లిష్ భాషలో ముద్రించి విడుదల చేస్తుంటారు. దీనిపై గతంలో చాలా విమర్శలు వచ్చేవి! ఈ నేపథ్యంలో తాజాగా వ్యవసాయ, సహకార శాఖ - పంట రుణ మాఫీ పథకం - 2024 మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం తెలుగులో విడుదల చేసింది.

దీంతో... ఇలా ప్రభుత్వ జీవోను రైతులందరికీ అందరికీ అర్థమయ్యేలా తెలుగులో విడుదల చేయడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఇకపై ఉత్తర్వ్యులన్నీ తెలుగులోనే అందించాలని ఆకాంక్షించారు.

ఇందులో భాగంగా... "ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం" అని వెంకయ్యనాఉడు ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో... "ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ.. తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుకి, ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు" అని తెలిపారు.

అదేవిధంగా... "రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నాను" అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.