Begin typing your search above and press return to search.

కోమ‌టి రెడ్డి కొంటె మాట‌లు.. రైతు బంధు వివాదం!

తెలంగాణ‌లో అంద‌రినీ క‌లుపుకొని పోతామ‌ని, రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగానే చూస్తామ‌ని ఒక‌వైపు సీఎం రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   24 Jan 2024 6:19 AM GMT
కోమ‌టి రెడ్డి కొంటె మాట‌లు.. రైతు బంధు వివాదం!
X

తెలంగాణ‌లో అంద‌రినీ క‌లుపుకొని పోతామ‌ని, రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగానే చూస్తామ‌ని ఒక‌వైపు సీఎం రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే చెబుతున్నారు. వివాదాస్ప‌ద రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని, విశ్లేష‌ణాత్మ‌క రాజ‌కీయాల‌కు చేరువ‌గా ఉండాల‌ని కూడా ఆయ‌న చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా క‌ర‌డు గ‌ట్టిన వ్య‌తిరేక పార్టీ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు త‌న‌ను క‌లిసేందుకు వ‌స్తామ‌న్నా.. సాద‌రంగా సీఎం రేవంత్ ఆహ్వానించారు. ఇదంతా కూడా రాష్ట్రంలో వివాద ర‌హిత రాజ‌కీయాల‌కు పునాదులు వేయాల‌నే స‌త్సంక‌ల్ప‌మే.

అయితే.. మ‌రోవైపు రేవంత్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాత్రం క‌వ్వింపు, కొంటె వ్యాఖ్య‌లు చేశారు. చెప్పుతో కొట్టండి! అంటూ.. తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. రాష్ట్రంలో రైతు బంధు ప‌థ‌కం అమ‌ల‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. రేవంత్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. చాలా మంది రైతుల‌కు రైతు బంధు నిధులు వారి ఖాతాల్లో జ‌మ కాలేద‌ని.. మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి తాజాగా విమ‌ర్శ‌లు చేశారు. ఇవిరాజ‌కీయ ప‌ర‌మైన విమ‌ర్శ‌లే. అయితే.. ఈ విమ‌ర్శ‌ను తీవ్రంగా భావించారో.. లేక త‌న ఫైర్ బ్రాండ్ ముద్ర చెరిగిపోకూడ‌ద‌ని అనుకున్నారో తెలియ‌దు కానీ.. కోట‌మిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

''రైతు బంధు నిధులు ప‌డ‌లేద‌న్న వాళ్ల‌ను చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేక‌పోతే.. ప్ర‌శ్నించండి'' అని మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే.. ఒక‌వైపు స‌జావుగా పాల‌న సాగిస్తున్న రేవంత్ ప్ర‌భుత్వానికి ఇలాంటి రాజ‌కీయ విమ‌ర్శ‌లు.. ఇబ్బందిగా మారుతాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాను వివాదాల‌పాలై.. ప్ర‌భుత్వాన్ని కూడా వివాదాల్లోకి నెట్టేలా కోమ‌టిరెడ్డి కొంటె వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని.. నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.