Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూపై వెంకటేశ్‌ సంచలన వ్యాఖ్యలు!

విదేశాలకు సబ్బులు ఎగుమతి చేయాలంటేనే ఇన్ని నిబంధనలు ఉంటాయని టీజీ వెంకటేశ్‌ తెలిపారు.

By:  Tupaki Desk   |   29 Sep 2024 10:08 AM GMT
తిరుమల లడ్డూపై వెంకటేశ్‌ సంచలన వ్యాఖ్యలు!
X

తిరుమల లడ్డూపై బీజేపీ మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుళ్లిపోయిన జంతువుల కొవ్వు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దొరుకుతుందని ఆయన చెప్పారు. విదేశాలకు సబ్బులు ఎగుమతి చేయాలంటే వాటిలో జంతువుల కొవ్వులు కలపలేదని డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విదేశాలకు సబ్బులు ఎగుమతి చేయాలంటేనే ఇన్ని నిబంధనలు ఉంటాయని టీజీ వెంకటేశ్‌ తెలిపారు.

ఈ నేపథ్యంలో పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి విషయంలో ఎంత కట్టుదిట్టమైన చర్యలు ఉండాలని టీజీ వెంకటేశ్‌ ప్రశ్నించారు. వనస్పతి అంటే అందులో రైస్‌ ఆయిల్, జంతువుల ఆయిల్‌ కూడా కలుస్తుందని వెల్లడించారు.

నెయ్యిలో నాణ్యత లేకుండా అందులో ఏది కలిపినా కల్తీ జరిగినట్టేనని టీజీ వెంకటేశ్‌ తెలిపారు. హత్య చేసినప్పుడు కత్తి అయినా, తుపాకీ అయినా ఒక్కటేనని.. దేన్నిబట్టి చంపారనే దానిబట్టి శిక్ష ఉండదని గుర్తు చేశారు. హత్యను హత్యగానే చూస్తారన్నారు. అలాగే నెయ్యి కల్తీకి కారకులయినవారికి కూడా ఇలాగే శిక్ష ఉంటుందన్నారు.

నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రభుత్వం కేసు పెట్టిందని.. దీనిపై విచారణ చేస్తున్నారని.. ఇక ప్రభుత్వం వేరే అంశాలపై దృష్టిపెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

తిరుమల లడ్డూ నాణ్యత బాగోలేదని ఎప్పటి నుంచో భక్తులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారని టీజీ వెంకటేశ్‌ గుర్తు చేశారు. రాజులు, వారి పెట్టిన సామంతరాజులు సరిగ్గా ఉంటే ఇలాంటివి జరగవని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వేసిన సిట్‌ పై వారికి నమ్మకం లేకపోతే, సీబీఐపైన కూడా వారు ఇలాగే వ్యవహరిస్తారని అన్నారు. అందుకే గతంలో వారి కేసుల్లో సీబీఐకి కూడా సహకరించలేదని గుర్తు చేశారు.

టీటీడీ పాలకమండలికి తనలాంటి వారు అనర్హులని టీజీ వెంకటేశ్‌ చెప్పారు. ఆలయానికి పాలకమండలి ఛైర్మన్‌ గా ఉండేవారు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం చేయకూడదన్నారు. అక్కడే ఉండి ఆలయపాలన చూసుకోవాలన్నారు.

ప్రస్తుతం టీజీ వెంకటేశ్‌ కుమారుడు టీజీ భరత్‌ చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుంచి టీజీ భరత్‌ టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేరారు.