చంద్రబాబు తోడల్లుడు సంచలన వ్యాఖ్యలు!
మాజీమంత్రి, సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవయ్యావని అన్నారు.
By: Tupaki Desk | 4 Oct 2024 11:23 AM GMTమాజీమంత్రి, సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవయ్యావని అన్నారు. ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని అభిప్రాయపడ్డారు. గెలిచిన తర్వాత కూడా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం రూ.20 కోట్లు కావాలని దగ్గుబాటి వెంకటేశ్వర రావు తెలిపారు. ఒకవేళ గెలిస్తే మరో రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలంటే మొత్తం మీద రూ.50 కోట్లు చేతిలో ఉంచుకోవాల్సిందేనని తెలిపారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు.
గతంతో పోలిస్తే ప్రస్తుత రాజకీయాలు వేరుగా ఉన్నాయన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయకుండా ఉండి తాను అదృష్టవంతుడనయ్యాయని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. మొన్నటి ఎన్నికలలో పోటీ చేయనందుకు తనకు ఏ మాత్రం బాధ లేదన్నారు. రాజకీయాల నుంచి సంతృప్తితో విరమణ తీసుకున్నానని భావిస్తున్నానన్నారు.
ఉద్యోగాల పైనా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఉద్యోగాలు సులభంగా వచ్చేవన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు.
1985లో ఉద్యోగాలు సులువుగా వచ్చేవని దగ్గుబాటి వెంకటేశ్వర రావు గుర్తు చేసుకున్నారు. కాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆరుసార్లు టీడీపీ, కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
ప్రస్తుతం దగ్గుబాటి సతీమణి పురందేశ్వరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. గతంలో విశాఖ, బాపట్ల నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన పురందేశ్వరి 2024 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు.