ఇంట్రస్టింగ్ కామెంట్స్... వేణు స్వామీ నెక్స్ట్ ఇన్నింగ్స్ ఇదేనంట!
ఈ నేపథ్యంలో తాజాగా తన కొత్త ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
By: Tupaki Desk | 7 Dec 2024 7:54 AM GMTప్రధానంగా సినిమా సెలబ్రెటీల గురించి, రాజకీయ నాయకుల ఫ్యూచర్ గురించి, ఎన్నికల ఫలితాల గురించి.. ఇలా హాట్ టాపిక్ గా ఉన్న విషయాలపై జ్యోతిష్యం చెబుతూ అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన వారిలో వేణు స్వామి ఒకరు! ఈయనను పలువురు నెటిజన్లు "సెలబ్రెటీ స్వామి" అని కూడా పిలుస్తుంటారు!
ఈయన టీవీ ఇంటర్వ్యూల్లో పలు జాతకాలు, జ్యోతిష్యాలు చెబుతుంటారు.. అందులో పలు సంచలన విషయాలూ ఉంటాయి! ఇక మరికొన్ని తీవ్ర వివాదాస్పదమైనవీ ఉన్నాయి. వాటి ఫలితంగా.. మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చే వరకూ వెళ్లింది వ్యవహారం. ఈ నేపథ్యంలో తాజాగా తన కొత్త ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అవును... నెట్టింట సెలబ్రెటీ స్వామిగా ఫేమస్ అయ్యి, అనంతరం వివాదాల స్వామిగా మారిన వేణు స్వామి తాజాగా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ - ఎఫెక్ట్ పైనా, 2024 ఎన్నికల్లో జగన్ మెజారిటీ పైనా జోస్యాలు చెప్పిన వేణు స్వామిపై నెట్టింట ట్రోలింగ్స్ నడిచిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో... గతంలో నాగచైతన్య - సమంతల విడాకులపైనా.. ఇటీవల నాగచైతన్య - శోభితల వైవాహిక జీవితంపైనా వేణు స్వామి చెప్పిన జ్యోస్యాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విరుచుకుపడగా.. మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి. అనంతరం... ఇటీవల బాగా అగ్రసివ్ నెస్ వచ్చిందని.. ఇది కాదు, ఇంకేదో చేయాలని అనిపించిందని.. 2028, 2029 ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి వెళ్లాలనే బలమైన ఉద్దేశ్యం వచ్చిందని చెప్పుకొచ్చారు.
అయితే... ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరి వేణు స్వామి పొలిటికల్ ఎంట్రీని స్వాగతించే రాజకీయ పార్టీ ఏది... ఏ పార్టీ ముందుకురానిపక్షంలో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తారా అనేది వేచి చూడాలి!