Begin typing your search above and press return to search.

పేటకు విడదల...వైసీపీ నుంచి మర్రి విడుదల ?

ఒకరు ఇన్ అంటే మరొకరు అవుట్. ఇది రాజకీయ నీతి. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అన్న ముతక సామెత ఉండనే ఉంది.

By:  Tupaki Desk   |   10 Nov 2024 3:18 PM GMT
పేటకు విడదల...వైసీపీ నుంచి మర్రి విడుదల ?
X

ఒకరు ఇన్ అంటే మరొకరు అవుట్. ఇది రాజకీయ నీతి. రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడవు అన్న ముతక సామెత ఉండనే ఉంది. అది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సామెత. అందుకే ఇద్దరు గట్టి నాయకులు ఒకే పార్టీలో ఇమడలేరు. అది గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మరోసారి రుజువు కాబోతోందా అంటే పరిణామలు అలాగే దారి తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. పేటలో మాజీ మంత్రి విడదల రజనీ వర్సెస్ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నట్లుగా వైసీపీ రాజకీయం మారుతోంది అని అంటున్నారు.

చిలకలూరిపేటలో వైసీపీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన 2004లో ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చూపించారు. ఆ తరువాత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. 2009లో ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కానీ ఓటమి పాలు అయ్యారు.

ఇక వైఎస్సార్ మరణానంతరం జగన్ వెంట నడచిన కాంగ్రెస్ ముఖ్యులలో ఆయన ఒకరు. ఆయన వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్ కి గుర్తింపు ఉంది. ఆయనకు జగన్ 2014లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు. కానీ ఓటమి పాలు అయ్యారు. దాంతో టీడీపీ నుంచి వైసీపీలోకి 2019 ఎన్నికల ముందు వచ్చి చేరిన విడదల రజనీకి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. వైసీపీ ప్రభంజనం, బీసీ కార్డుతో రజనీ విజయం సాధ్యపడింది.

ఇక 2024 ఎన్నికల నాటికి రజనీ మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్ కి పంపించి అక్కడ వైసీపీ నేత కావటి శివ నాగ మోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. ఆయన 77 వేల దాకా ఓట్లు తెచ్చుకున్నా మాజీ మంత్రి టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో 33 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు.

ఇక చిలకలూరిపేటలో మొదటి నుంచి ఉన్న మర్రి రాజశేఖర్ కే ఇంచార్జి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆయనకు ఇస్తేనే టీడీపీని ఓడించి నెగ్గగలరని వారు చెబుతున్నారు. మాజీ మంత్రి విడదల రజనీకి బాధ్యతలు అప్పగించవద్దు అని అని కోరినట్లుగా కూడా ప్రచారం సాగింది.

అయితే మూడు రోజుల క్రితం వైసీపీ అధినాయకత్వం విడదల రజనీకి చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించింది. దాంతో ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు అని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ వర్గం గుర్రుగా ఉందని అంటున్నారు. పార్టీలో ఉంటే ఇక లాభం లేదు అని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

వైసీపీని వీడే సమయం కూడా ఆసన్నం అయినట్లుగా కూడా మర్రి వర్గం నుంచి సంకేతాలు వస్తున్నాయని అంటున్నారు. ఎమ్మెల్సీగా కూడా ఉండడంతో టీడీపీ కూటమి సైతం ఆయన రాకను ప్రోత్సహిస్తుంది అని అంటున్నారు.

మాజీ మంత్రి విడదల రజనీతో రాజీ పడేది లేదు అంటున్న మర్రి రాజశేఖర్ వర్గం అంతా కలసి టీడీపీ కానీ జనసేనలో కానీ చేరే చాన్స్ ఉందని అంటున్నారు. టీడీపీకి అయితే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారని అంటున్నారు. సో జనసేనలో చేరితే బాగుంటుంది అన్న చర్చ కూడా ఉందిట.

ఇక వైసీపీ నుంచి మర్రి రాజశేఖర్ విడుదల అవుతారని ఆ బంధాలను అనుబంధాలను తెంచుకుని ఆయన తనకు నచ్చిన పార్టీలో చేరిపోతారని అంటున్నారు. మరి ఇది నిజమయ్యే చాన్స్ ఎక్కువగా ఉందని నియోజకవర్గంలో అయితే ప్రచారం సాగుతోంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.