విడదల రజనీ మీద కేసు ఫైల్ చేయాల్సిందేనా ?
అవన్నీ ఒక ఎత్తు అయితే మరో కేసు చిత్రంగా ఆమె మెడకు చుట్టుకునెలా ఉంది.
By: Tupaki Desk | 6 Feb 2025 3:46 AM GMTవైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి రెండేళ్ళూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హవా చాటుకున్న మహిళా నాయకురాలు విడదల రజనీ. ఆమె పార్టీ ఓడినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం నుంచి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆమె మంత్రిగా పనిచేసిన కాలంలో చేసిన పనుల మీద ప్రత్యర్ధులు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు.
అవన్నీ ఒక ఎత్తు అయితే మరో కేసు చిత్రంగా ఆమె మెడకు చుట్టుకునెలా ఉంది. ఒక టీడీపీ నేత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను చిత్ర హింసలకు గురి చేశారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్ళడంతో మాజీ మంత్రి విడుదల రజనీ తో పాటు ఆమె పీఏలు దొడ్డా రామకృష్ణ, ఫణితోపాటు అప్పటి సీఐ సూర్యనారాయణ పై కేసు నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
దీంతో విడదల రజనీ చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే టీడీపీ నేత పిల్లి కోటి తన మీద అప్పట్లో జరిగిన చిత్ర హింస మీద హైకోర్టును ఆశ్రయించడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. తానేమీ తప్పు చేయకపోయినా ఇబ్బందులు పెట్టారని ఆయన కోర్టులో చెప్పుకున్నారు.
తాను అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురిచేశారని పిల్లి కోటి ఆరోపించారు. 2019లో చిలకలూరి పోలీస్‌స్టేషన్‌లో తాను ఇలాంటి చిత్ర హింసలకు గురయ్యానని ఆయన చెప్పారు. అయితే తాను అప్పుడు ఫిర్యాదు చేసినా ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
తాను అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. పిల్లి కోటి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద విచారించిన కోర్టు ఈ విషయంలో మాజీ మంత్రితో సహా ఇతరుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాంతో కోర్టు ఆదేశాల మేరకు పల్నాడు పోలీసులు రెండు వారాలలో కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ మేరకు పిల్లి కోటి కూడా ఎస్పీని కలిశాడు ఆయనకు న్యాయం చేస్తామని పోలీసులు సైతం హామీ ఇచ్చారు.
ఇవన్నీ ఇలా ఉంటే విడదల రజనీ మీద ఈ వైపు నుంచి ఇలాంటి కేసు వస్తుందని ఆమె అనుచరులు సైతం ఊహించలేదని అంటున్నారు. ఆమె మంత్రిగా ఉన్నపుడు తీసుకున్న చర్యల మీద ప్రత్యర్ధులు అయితే విమర్శలు ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ ఒక సాధారణ టీడీపీ నాయకుడు కోర్టుకు వెళ్ళి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ చేయించేలా చూడడంతోనే ఆమె వర్గీయులలో కలవరం రేగుతోంది. మరి మాజీ మంత్రి మీద కేసు ఫైల్ అయితే ఏమి జరుగుతుంది అన్నదే ఆసక్తిని కలిగించే చర్చగా ఉంది. చూడాలి మరి విడదల రజనీ ఈ విషయంలో ఏమి చేస్తారు అన్నది.