తట్టుకోలేవ్ పుల్లారావు.. విడదల రజిని స్ట్రాంగ్ వార్నింగ్
టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుట్రతో తనతోపాటు తన కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు.
By: Tupaki Desk | 8 Feb 2025 12:40 PM GMTతనపై అక్రమ కేసు నమోదు చేశారంటూ మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుట్రతో తనతోపాటు తన కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. తనకే కాదు ఎమ్మెల్యే పుల్లారావుకు కుటుంబం ఉందన్న విషయం గుర్తించుకోవాలని.. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు.
మాజీ మంత్రి విడదల రజిని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం తనను టార్గెట్ చేయడాన్ని ఆమె సహించలేకపోతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలతో సంబంధంలేని తన వాళ్లను కేసుల్లో ఇరికిస్తున్నారని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఏడేళ్ల రాజకీయ అనుభవం ముందు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాతికేళ్ల రాజకీయ అనుభవం ఎందుకూ పనికిరాదని అన్నారు. ‘‘తనకు ఇంకా నాలుగేళ్ల అధికారం ఉందని ఎమ్మెల్యే పుల్లారావు అనుకుంటున్నారు. మమ్మల్ని (వైసీపీ నేతలు, కార్యకర్తలు) వేధించొచ్చని అనుకుంటున్నారు. కానీ, నాకు ఇంకా వయసు ఉంది. మరో 30 ఏళ్లు ... దేవుడు కరుణిస్తే 40 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా అప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు ఎక్కడున్నా, వదిలేది లేదంటూ’’ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు విడదల రజిని.
అక్రమ కేసులు పెట్టి తనను తన కుటుంబ సభ్యులను భయపెట్టలేరన్న విడదల రజిని, కేసులకు భయపడమని మరింత బలంగా ఎదుగుతామని అన్నారు. నాలుగేళ్లు అధికారంలో ఉందని దోపిడీలు, దౌర్జన్యాలు, ఇల్లీగల్ పనులు చేసి సంపాదించుకుందామని అనుకుంటున్నారేమో.. నేను మరో 30 నుంచి 40 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా.. మీరు ఎక్కడున్నా లాక్కొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. కట్టుకథలు అల్లి తమపై కేసులు పెడుతున్న ఏ ఒక్కరినీ మరచిపోమని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
అధికారులు అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పిన రజిని.. అక్రమాలకు కొమ్ముకాయొద్దని హితవు పలికారు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, అలాంటి వారు భవిష్యత్ లో తగిన పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఎమ్మెల్యే పుల్లారావుతోపాటు టీడీపీ నాయకులు, అధికారులు ఏం చేసినా రియాక్షన్ కు సిద్ధంగా ఉండాలని, ఆ రోజు కచ్చితంగా వస్తుందని అన్నారు. మీ అందరి సంగతి తేలుస్తామని రజని వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.