Begin typing your search above and press return to search.

విడదల రజనీకి షాక్... రైతుల కమిషన్ డబ్బులు వెనక్కి!

ఈ క్రమంలో రైతులంతా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ డబ్బులు వసూలు చేశారు.

By:  Tupaki Desk   |   28 Jun 2024 9:30 AM GMT
విడదల రజనీకి షాక్... రైతుల కమిషన్  డబ్బులు వెనక్కి!
X

ఏపీలో తాజాగా ఓ అరుదైన ఘటన తెరపైకి వచ్చింది. రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె అనుచరులు.. తమ వద్ద నుంచి గుంజుకున్న కమిషన్ సొమ్మును కక్కించారు రైతులు! ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏమి జరిగింది.. ఎంత వెనక్కి వచ్చింది.. ఎలా వచ్చింది.. ఈ వ్యవహారం అంతా ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం...!

అవును... రాష్ట్రవ్యాప్తంగా పలు వైసీపీ కార్యాలయాలు అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలంటూ అధికారులు నోటీసులిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క చిలకలూరిపేటకు చెందిన మాజీమంత్రి విడదల రజనీ అనుచరులు తమను మోసం చేసి, అక్రమంగా డబ్బులు దండుకున్నారని పలువురు రైతులు ఆరోపించారు! ఈ క్రమంలోనే సుమారు. రూ.1.16 కోట్లు కమిషన్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో రైతులంతా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ డబ్బులు వసూలు చేశారు. దీంతో... చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామంలో రజనీ అనుచరులు రైతుల వద్ద కమిషన్ గా తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేశారని తెలుస్తుంది. ఈ మేరకు చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు, రైతు నాయకుడు గడిపూడి దశరథ రామయ్యలు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు!

ఇందులో భాగంగా... పసుమర్రు గ్రామానికి సమీపంలో ఉన్న గుదేవారిపాలెంలో సుమారు 200 ఎకరాల భూమిలో జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో రజనీ మంత్రిగా ఉన్న సమయంలో సుమారు 150 ఎకరాల భూసేకరణకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే 32 మంది రైతుల నుంచి 50 ఎకరాలు భూసేకరణ చేశారు.

ఈ సమయంలో ఆ రైతుల నుంచి రజనీ అనుచరులు రూ.1.16 కోట్ల మొత్తాన్ని వసులు చేశారనేది ఆరోపణ! అయితే... తాజాగా ప్రభుత్వం మారడంతో ఆ రైతులంతా ఈ విషయంపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో... స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి కూడా ఈ విషయాన్ని తెచ్చారు. దీంతో... రజనీ మనుషులు రైతులకు రూ.90 లక్షలు వెనక్కి ఇచ్చారు!

మిగిలిన రూ.26 లక్షలు శుక్రవారం ఇచ్చే ఏర్పాటు చేశారని తెలుస్తుంది. దీంతో... రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క... ఈ వ్యవహారం వెనుక విడదల రజనీ ఉన్నారని.. ఆమె కనుసన్నల్లోనే ఈ కమిషన్ దందా జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా ఎవరైనా నష్టపోతే.. ఫిర్యాదులు చేయొచ్చని చెబుతున్నారు.