మహిళా మంత్రికి ఈసారి టికెట్ కష్టమేనటగా...?
వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి జరిపిన సమీక్షలో అక్కడ మహిళా మంత్రి విడదల రజనీ సీటు డౌట్ లో పడింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 25 Aug 2023 4:28 AM GMTవైసీపీ వై నాట్ 175 అంటోంది. గెలుపు ముఖ్యం కాదు బంపర్ విక్టరీ అంటోంది. అది సులువు కాకపోయినా ఆ రేంజిలో టార్గెట్ పెట్టుకుని వెళ్తే పొత్తులు ఎత్తులు ఎన్ని విపక్షాలు వేసినా మరోసారి అధికారం దక్కుతుంది అన్నదే వైసీపీ రాజకీయ మంత్రాంగం. అందుకే ఒక్కో సీటునూ మైక్రో లెవెల్ లో పరిశీలిస్తోంది. తప్పు సూది మొనంత కనిపించినా గట్టిగానే చూస్తోంది.
ఇలా పల్నాడు జిల్లాలో పార్టీ పరిస్థితి మీద వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి జరిపిన సమీక్షలో అక్కడ మహిళా మంత్రి విడదల రజనీ సీటు డౌట్ లో పడింది అని అంటున్నారు. చిలకలూరిపేట నుంచి విడదల రజనీ 2019లో అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. జగన్ వేవ్ లో గెలిచేశారు. ఆ తరువాత అంతకంటే ఆశ్చర్యంగా విస్తరణలో మంత్రి పదవిని అందుకున్నారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలు ఆమెకు లభించాయి.
అయితే ఆమెకు 2024లో టికెట్ దక్కుతుందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఎందుకంటే చిలకలూరిపేటలో రెండు వర్గాలు ఉన్నాయి. విడదల రజనీకి యాంటీగా నర్సారావుపేట ఎంపీ లావు క్రిష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఒక్కటిగా నిలిచి పావులు కదుపుతున్నారు. మంత్రి తమను పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు ఇక విడదల రజనీ మంత్రిగా ఉంటూ సొంత నియోజకవర్గంలో వర్గాలను ప్రోత్సహించడం ఏంటన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.
ఈ సమీక్షలో విజయసాయిరెడ్డికి మంత్రి ప్రత్యర్ధి వర్గం చెప్పాల్సింది చెప్పేశారు అని అంటున్నారు. విడదల రజనీకి టికెట్ ఇస్తే తాము సహకరించే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. నాలుగేళ్ళుగా మంత్రి ఒంటెద్దు పోకడలు పోయారని తాము భరించలేమని అంటున్నారు. ఆమెకే తిరిగి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా తమలో ఒకరిని అయినా నిలబెట్టి తామే ఓడిస్తామని కూడా హెచ్చరించారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఐప్యాక్ టీం చేసిన సర్వేలలో సైతం మంత్రి విడదల రజనీకి చిలకలూరిపేటలో ఎదురుగాలి వీస్తోంది అని వచ్చిందట. దాంతో విజయసాయిరెడ్డి మంత్రికి కచ్చితంగా చెప్పేసారు అని అంటున్నారు. వర్గాలను అన్నీ కలుపుకుని ముందుకు వెళ్లాలని సుతిమెత్తగా హెచ్చరించారని అంటున్నారు. ఒకవేళ అలా కనుక చేయకపోతే పార్టీకే ఇబ్బంది అవుతుదని చెప్పాల్సింది చెప్పారని అంటున్నారు మరి మంత్రి వర్సెస్ ఎంపీ ప్లస్ ఎమ్మెల్సీ గా ఉన్న చిలకూరిపేట కధ ఏ తీరం చేరుతుందో అన్న చర్చ అయితే వైసీపీలో ఉంది. విడదల రజనీకి టికెట్ ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు అన్నది మరో చర్చగా ఉంది.