తిరుమల దర్శనం కోసం ఆధార్ ఇస్తే.. విద్యాసాగర్ అంత పని చేశాడట!
ఒక పారిశ్రామికవేత్త కోసం బాలీవుడ్ నటిని విజయవాడలో తప్పుడు కేసు పెట్టి దారుణ వేధింపులకు గురి చేసిన ఉదంతం గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 31 Aug 2024 5:36 AM GMTఒక పారిశ్రామికవేత్త కోసం బాలీవుడ్ నటిని విజయవాడలో తప్పుడు కేసు పెట్టి దారుణ వేధింపులకు గురి చేసిన ఉదంతం గురించి తెలిసిందే. దీనికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తనను మోసం చేశారంటూ వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తీసుకొని ఆమెను అరెస్టు చేయటం.. తీవ్ర వైధింపులకు గురి చేసిన ఉదంతాలు బయటకు వచ్చి సంచలనంగా మారాయి. అయితే.. ఈ ఎపిసోడ్ మొత్తంలోనూ తనను కావాలనే కేసుల్లో భారీగానే ఫేక్ స్క్రిప్టును సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా క్రిష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చింతా వీర వెంకట నాగేశ్వరరావు సీన్లోకి వచ్చారు. ఎవరు ఇతను? బాలీవుడ్ నటి ఎపిసోడ్ కు ఆయనకు ఉన్న లింకు లెక్కలు విస్మయానికి గురి చేస్తాయంతే. జగ్గయ్యపేటలోని తనకు చెందిన ఐదు ఎకరాల భూమిని బాలీవుడ్ నటి కాదంబరీ మోత్వానీకి అమ్మినట్లుగా ఆమె తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారన్నది వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు. దీని ఆధారంగా చేసుకొనే ఆమెను అరెస్టు చేయటం.. రిమాండ్ చేయటం లాంటివి జరిగాయి.
అయితే.. ఈ ఉదంతంలో ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా తన భూమిని సొంతం చేసుకున్న కాదంబరీ.. ఆ ల్యాండ్ ను క్రిష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరుకు చెందిన మాజీ సర్పంచ్ చిందా వీర వెంకట నాగేశ్వరరాజుకు అమ్మే ప్రయత్నం చేశారని.. ఇందులో భాగంగా ఆయన నుంచి రూ.5 లక్షలు వసూలు చేసినట్లుగా విద్యాసాగర్ ఫిర్యాదు చేయటం తెలిసిందే.
అయితే.. ఈ సందర్భంగా ప్రస్తావించిన వీర వెంకట నాగేశ్వరరాజు తాజాగా సీన్లోకి వచ్చారు. అసలు తనకు బాలీవుడ్ నటి ఎలాంటి భూమి అమ్మే ప్రయత్నం చేయలేదని.. తాము రూ.5లక్షలు ఇవ్వలేదని నాగేశ్వరరాజు తాజాగా వెల్లడించారు. అసలు ఈ వ్యవహారంతో తమకు సంబంధమే లేదని తేల్చేసిన ఆయన.. మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను.. తన అల్లుడు భరత్ కుమార్ ల ఆధార్ కార్డులను విద్యాసాగర్ కు తిరుమల దర్శనం కోసం ఇచ్చామని.. వాటిని తీసుకొని తమను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని వాపోతున్నారు. దీనికి సంబంధించిన కంప్లైంట్ ను తాజాగా కూచిపూడి పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు.
తనకు ఎవరూ విద్యాసాగర్ భూమిని అమ్మే ప్రయత్నం చేయలేదని.. తాము ఎవరికి రూ.5 లక్షల అడ్వాన్సు ఇచ్చింది లేదని కూచిపూడి పోలీసులకు నాగేశ్వరరాజు స్పష్టం చేశారు. ముంబయి నటిపై పోలీసులు ఎంత దారుణంగా కేసు నమోదు చేశారన్న విషయం నాగేశ్వరరాజు మాటలతో అర్థమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కుక్కల విద్యాసాగర్ తండ్రి క్రిష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు తమకు చాలా సన్నిహితులని.. ఆయనపై తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సిఫార్సు లెటర్ కోసం తమ ఆధార్ కార్డు జిరాక్స్ ను కుక్కల నాగేశ్వరరావు పీఏగా పని చేసిన శ్రీనివాసరావుకు ఇచ్చామని.. వాటిని దుర్వినియోగం చేశారన్నారు.
బాలీవుడ్ నటి నుంచి ఐదు ఎకరాలు కొన్నట్టు.. రూ.5 లక్షలు అడ్వాన్సుగా చెల్లించినట్లుగా ఇబ్రహీంపట్నం పోలీసుల ద్వారా.. మీడియా ద్వారా వివరాలు తెలిశాయని.. అయితే.. తాను.. తన అల్లుడు ఎలాంటి భూమిని కొన్నది లేదని.. అడ్వాన్సు ఇచ్చింది లేదని నాగేశ్వరరాజు వెల్లడించారు. రోజులు గడిచే కొద్దీ.. ముంబయి నటి కాదంబరీ మోత్వానీ ఎపిసోడ్ కొత్త మలుపులు తిరుగుతుందని చెప్పక తప్పదు.