వస్తున్నాడు 'విద్వత్' ఉన్న పేసర్.. గుర్తుపెట్టుకోండి ఇతడిని
ఇదీ కర్ణాటకకు చెందిన 24 ఏళ్ల పేసర్ విద్వత్ కావేరప్ప ఘనత. దేశవాళీ క్రికెట్ లో ఇప్పుడు ఇతడో సంచలనం
By: Tupaki Desk | 16 July 2023 11:38 AM GMTచతేశ్వర్ పుజారా.. సూర్యకుమార్ యాదవ్.. సర్ఫరాజ్ ఖాన్.. వీరిలో పుజారా టీమిండియాకు వందపైగా టెస్టులాడిన బ్యాట్స్ మన్. సూర్యకుమార్ యాదవ్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో అందరికీ తెలుసు.. ఇక సర్ఫరాజ్ ఖాన్ రంజీట్రోఫీల్లో సెంచరీల సెంచరీలు కొడుతున్నాడు. ఈ ముగ్గురినీ ఒకే మ్యాచ్ లో ఓ కుర్ర పేసర్ ఔట్ చేశాడు. అదికూడా వరుసగా.. ఎంతో విద్వత్ (ప్రతిభ) ఉంటే తప్ప సాధ్యం కాని ఫీట్ ఇది. అవును అతడిలో అంతటి ప్రతిభ ఉంది మరి.
టీమిండియాకు వస్తాడు చూడండి కేవలం 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు 49 వికెట్లు.. అందులో నాలుగుసార్లు ఐదు వికెట్లు.. 8 లిస్ట్ ఏ మ్యాచ్ ల్లో 17 వికెట్లు.. 8 టి20ల్లో 17 వికెట్లు.. ఇదీ కర్ణాటకకు చెందిన 24 ఏళ్ల పేసర్ విద్వత్ కావేరప్ప ఘనత. దేశవాళీ క్రికెట్ లో ఇప్పుడు ఇతడో సంచలనం. టీమిండియాకు కచ్చితంగా ఎంపికవుతాడనే అంచనాలున్న క్రికెటర్.
ఆదివారం ముగిసిన దులీప్ ట్రోఫీని సౌత్ జోన్ గెలవడంలో విద్వత్ దే కీలక పాత్ర. తొలి ఇన్నింగ్స్ లో 53 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టి వెస్ట్ జోన్ ను దెబ్బతీశాడు అతడు. అందులోనూ పుజారా, సూర్యలను ఔట్ చేశాడు.
అంతకుముందు నార్త్ జోన్ తో జరిగిన మ్యాచ్ లోనూ కావేరప్ప తొలి ఇన్నింగ్స్ లో 5, రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఇటీవలి రంజీ సీజన్ లోనూ విద్వత్ గణాంకాలు అదుర్స్ అనేలా ఉన్నాయి.
18 ఏళ్ల వరకు క్రికెట్ తెలియదు..రంజీల్లో ఇంతగా అదరగొడుతున్న కావేరప్ప దాదాపు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి పోటీ క్రికెట్ ఆడిందే లేదు. అయితే, ఆ తర్వాతే అతడి జీవితం మలుపు తిరిగింది. కర్ణాటక లోని కొడగు జిల్లాకు చెందిన ఈ కుడిచేతి వాటం పేసర్ ఇటీవలి రంజీ సీజన్ లో 30 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్ దిగ్గజం డేల్ స్టెయిన్, టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీని ఆదర్శంగా తీసుకునే కావేరప్ప వారిలాగే వేగం, పదునుగా బౌలింగ్ చేయగలడు. అతడు ఇదే నిలకడ కొనసాగిస్తే ఏడాదిలోపే టీమిండియాకు ఆడే అవకాశం దక్కించుకోవడం ఖాయం.