ఆమె.. 'భూ మేత' లక్ష కోట్లు.. రియాల్టీలో ఘరానా మోసం
వాన్ తిన్హ్ పాట్.. వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ. ఈ కంపెనీ చైర్ పర్సన్ ట్రుయాంగ్ మైలాన్. ఆమెకు సైగాన్ వాణిజ్య బ్యాంకు 90 శాతం వరకు వాటా ఉంది.
By: Tupaki Desk | 1 Feb 2024 12:30 AM GMTమహిళలు నేరాలు చేయడం అత్యంత అరుదు.. అందులోనూ రియల్ ఎస్టేట్ రంగంలో మహా అరుదు.. బాగా డెవలప్ చెందిన అమెరికా లేదా పశ్చిమ దేశాల్లో అయితే మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. భారత్ లో ఇంకా ఆ స్థాయికి చేరలేదు. అయితే.. ఆసియాలోనే ఓ మాదిరి డెవలప్ మెంట్ ఉన్న దేశమైన వియత్నాంలో మాత్రం ఓ మహిళా వ్యాపారి అతి భారీ మోసానికి పాల్పడినట్లు తేలింది.
ఆగ్నేయాసియా దేశాల్లో కాస్తొకూస్తో వినిపించే పేరు వియత్నాం. ఒకప్పుడు అమెరికాకు ఎదురొడ్డి యుద్ధం చేసి ఆ దేశం తోకముడిచేలా చేసిన ఘనత ఆ దేశం సొంతం. ఈ దేశ జనాభా ప్రస్తుతం 10 కోట్లు ఉంటుంది. జనాభాలో ఆసియాలో 9వ స్థానంలో ఉందీ దేశం. ఉత్తరాన చైనా సరిహద్దు గత వియత్నాంకు.. లావోస్, కాంబోడియా, మలేసియా, ఫిలిప్ఫీన్స్, ఇండోనేసియాతోనూ సరిహద్దులున్నాయి. కాగా, వియత్నాంలో తాజాగా వందల కోట్ల డాలర్ల మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తం దేశంలో రియల్ ఎస్టేట్ టైకూన్ అని భావించే మహిళ ఏకంగా 12.5 బిలియన్ డాలర్ల (రూ.లక్ష కోట్ల పైగా) ప్రజల సొమ్మును కాజేసినట్లుగా తేలింది. ఆమె కారణంగా నష్టపోయిన వేలాదిమంది లబోదిబోమంటున్నారు.
వాన్ తిన్హ్ పాట్.. వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ. ఈ కంపెనీ చైర్ పర్సన్ ట్రుయాంగ్ మైలాన్. ఆమెకు సైగాన్ వాణిజ్య బ్యాంకు 90 శాతం వరకు వాటా ఉంది. అయితే, కొన్నాళ్లుగా ఆమె మోసాలకు పాల్పడ్డారు. నకిలీ రుణ దరఖాస్తులు పెట్టి రూ.కోట్ల మేర జేబులో వేసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో మొత్తానికే మోసం వచ్చింది. బ్యాంకు లావాదేవీలు ఆగిపోయే స్థితి వచ్చింది. కాగా, సైగాన్ బ్యాంకులో 42 వేల మంది డబ్బులు దాచుకున్నారు.
ఐదేళ్లు.. 916 లోన్ దరఖాస్తులు..
లాన్.. మోసానికి ఐదేళ్ల కిందటనే తెరతీసింది. 2018-22 మధ్యన ఐదేళ్లపాటు 916 నకిలీ దరఖాస్తులు సృష్టించింది. ఇలా బ్యాంకు నుంచి 304 ట్రిలియన్ డాంగ్ (వియత్నాం కరెన్సీ)లు తీసుకుంది. డాలర్లలో చూస్తే ఇది 12.5 బిలియన్ డాలర్లకు పైమాటే. ఇక 2019-22 మధ్య డ్రైవర్ బ్యాంకు హెడ్ క్వార్టర్స్ నుంచి 4.4 బిలియన్ డాలర్ల నగదును లాన్ నివాసానికి తరలించింది కూడా. రెండేళ్ల కిందటనే స్కాం బయటపడగా ఆ ఏడాది అక్టోబరులో పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి బ్యాంకు బాండ్ హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు తీసుకునే చాన్సే లేకుండా పోయింది. కనీసం వడ్డీ కూడా రావడం లేదు. వందలాది మంది బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కుంభకోణంలో లాన్ తో పాటు 85 మందిపై కేసు నమోదైంది. ఇందులో బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్ లు, ప్రభుత్వ మాజీ అధికారులు కూడా ఉన్నారని సమాచారం. కాగా, పొరుగునే ఉండే హాంకాంగ్ కు చెందిన పెద్ద వ్యాపారిని లాన్ పెళ్లాడింది. వీరి వాన్ తిన్హ్ కంపెనీకి దేశవ్యాప్తంగా విలాసవంతమైన హోటళ్లు, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది కూడా. లాన్ సంపద విలువ 2022 నాటికి దేశ జీడీపీలో 3శాతం ఉంటుందని అంచనా.