తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారంలో బిగ్ ట్విస్టు
మాజీ స్పీకర్, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాంపై ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది.
By: Tupaki Desk | 24 March 2025 4:00 PM ISTమాజీ స్పీకర్, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాంపై ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది. డిగ్రీ చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ఆయన లా అడ్మిషన్ తీసుకున్నారని తమ్మినేని మేనల్లుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇంటర్ మాత్రమే చదువుకున్న తమ్మినేని లాయర్ డిగ్రీ చదవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్ 2022 నుంచి ఈ వ్యవహారంపై పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే కూన పోరాటం ఫలించడంతో తమ్మినేనిపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
ఎమ్మెల్యే కూన రవికుమార్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం రాజకీయంగా ప్రత్యర్థులు. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరూ మామా అల్లుళ్లు. దగ్గర బంధువులైనా ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం చాలా కాలంగా కొనసాగుతోంది. గతంలో టీడీపీలో పనిచేసిన సీతారాం ఆ తర్వాత పీఆర్పీ, కాంగ్రెస్, వైసీపీ పార్టీల్లో ప్రయాణం చేశారు. కానీ, కూన తొలి నుంచి టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. 2009లో పీఆర్పీ నుంచి తమ్మినేని, టీడీపీ నుంచి కూన రవికుమార్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి చెందారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బొడ్డేపల్లి సత్యవతి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో కూన, 2019లో తమ్మినేని, మళ్లీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూన ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే 2019లో తమ్మినేని గెలిచి స్పీకర్ అయ్యాక, వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఎమ్మెల్యే కూన టార్గెట్ గా ఎన్నో కేసులు నమోదయ్యాయి. అర్దరాత్రి కూడా ఆయన ఇంటిపై పోలీసులు దాడి చేయడంతో రాజకీయ వైరం బాగా ముదిరిపోయింది. ఈ క్రమంలోనే తమ్మినేని ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టైంది.
ఎన్నికల అఫిడవిట్ లో తాను ఇంటర్ వరకు చదువుకున్నట్లు చెప్పిన తమ్మినేని, 2020లో హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారని ఎమ్మెల్యే కూన ఆరోపిస్తున్నారు. స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి నైతిక విలువలు పాటించాలని సూచిస్తున్న ఎమ్మెల్యే కూన తన ప్రత్యర్థి తమ్మినేని మాత్రం వదిలిపెట్టేది లేదన్నట్లు సంకేతాలు పంపుతున్నారు. 2018లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చదవినట్లు తమ్మినేని ఫేక్ సర్టిఫికెట్ తయారు చేశారని, ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఆ యూనివర్శిటీని సంప్రదిస్తే తమ్మినేని డిగ్రీ సర్టిఫికెట్‌లో పేర్కొన్న రిజిస్టర్ నంబర్‌తోగానీ, పరీక్ష రాసినట్టు పేర్కొన్న సెంటర్ నంబర్‌లోగాని పరీక్ష రాయలేదని తేలిందని ఎమ్మెల్యే కూన చెబుతున్నారు. దీంతో తమ్మినేని దొంగ సర్టిఫికెట్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై గత ప్రభుత్వంలోనే కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి, తెలంగాణ, ఏపీ గవర్నర్లు, ఆనాటి సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. అయితే రాష్ట్రపతి తప్పితే మిగిలిన వారు ఆ ఫిర్యాదుపై స్పందించలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తన ఫిర్యాదుపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూన ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. దీంతో మాజీ స్పీకర్ తమ్మినేని చిక్కులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం వైసీపీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న తమ్మినేని ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడతారనేది ఉత్కంఠ రేపుతోంది.