Begin typing your search above and press return to search.

మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ రిపోర్టులో ఏముంది?

అంతేకాదు.. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన లాగ్ బుక్.. కాంక్రీట్ మిక్సింగ్.. నిర్వహణకు సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2024 6:41 AM GMT
మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ రిపోర్టులో ఏముంది?
X

కీలక అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా గులాబీ సర్కారుపై పడిన మేడిగడ్డ బ్యారేజ్ బండ.. ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపిందన్న వాదన గురించి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై ఆద్యంతం రహస్యంగా ఉంచిన కేసీఆర్ ప్రభుత్వం.. రేవంత్ సర్కారు కొలువు తీరినంతనే.. దానికి సంబంధించిన పలు అంశాలు బయటకు రావటం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజ్ కు సంబంధించి రేవంత్ ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ తాజాగా కీలక అంశాలతో నివేదికను సమర్పించిందని చెబుతున్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ సమస్య పెద్దగా లేదన్నట్లుగా చెప్పిన గులాబీ నేతల మాటల్లో నిజం లేదని.. ప్రాథమిక అంచనాల కంటే సమస్య తీవ్రత ఎక్కువగా ఉందన్న విషయం తాజాగా సిద్ధం చేసిన విజిలెన్స్ రిపోర్టు చెబుతుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. అధికారికంగా విడుదల కానప్పటికీ.. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏడో బ్లాక్ లోనే కాకుండా 6, 8 బ్లాక్ ల్లో కూడా మరిన్ని పియర్స్ కు నష్టం వాటిల్లినట్లుగా అంచనాలు ఇప్పుడు సంచలనంగా మారినట్లుగా చెప్పాలి.

అంతేకాదు.. బ్యారేజ్ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువుతో ఉండే సిమెంట్ బ్లాక్స్ వంద మీటర్లు దాటి కొట్టుకుపోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగటానికి.. పియర్స్ భారీగా దెబ్బ తినటానికి నాణ్యత.. నిర్వహణ లోపాలతో పాటు అనేక వైఫల్యాలు వెలుగు చూసినట్లుగా చెబుతున్నారు. తొలుత గుర్తించిన వాటి కంటే ఎక్కువ పియర్స్ డ్యామేజ్ అయినట్లుగా చెబుతున్నారు.

ఇప్పటివరకు పియర్స్ బీటలు వారినట్లుగా భావించినప్పటికీ.. తాజాగా జరిపిన విచారణలో అవి భారీగా డ్యామేజ్ అయిన కొత్త విషయాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. సమస్య తీవ్రత.. అంచనాలకు మించి చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తే.. డిజైన్ లోపాలు కూడా బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.

అంతేకాదు.. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన లాగ్ బుక్.. కాంక్రీట్ మిక్సింగ్.. నిర్వహణకు సంబంధించిన రికార్డులు కూడా అందుబాటులో లేకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఉదంతం అనూహ్యంగా చోటు చేసుకున్నది కాదంటున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో అధికారులు స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించి ఇంజినీర్లతో చర్చించారు. డిజైన్లు మొదలుకొని అందుబాటులో ఉన్న రికార్డులన్నీ విజిలెన్స్ అధికారులు విశ్లేషించారు.

తాజా అంచనాల ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ కుంగటం అన్నది రెండు.. మూడేళ్ల నుంచే మొదలైనట్లుగా తెలుస్తోంది. వర్షాకాలం ముందు చేయాల్సిన తనిఖీలు.. ఆప్రాన్ వద్ద ఉన్న స్ట్రక్చర్లను పట్టించుకోలేదంటున్నారు. వరద ప్రవాహానికి తగ్గట్లు డిజైన్లు లేకపోవటంతో 20 టన్నులు ఉండే ఒక్కొక్క సీసీ బ్లాకులు కూడా కొట్టుకుపోయినట్లుగా గుర్తించారు. మరింత.. లోతుగా విచారణ జరిపితే కేసీఆర్ అండ్ కో చిక్కుల్లో చిక్కుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.