Begin typing your search above and press return to search.

మళ్లీ 'ఆడుతా ఆంధ్రా'కు.. టీమిండియా క్రికెటర్ పొలిటికల్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలోని కాకినాడకు చెందిన గాదె హనుమ విహారి ప్రతిభావంతుడైన క్రికెటర్.

By:  Tupaki Desk   |   26 Jun 2024 6:17 AM GMT
మళ్లీ ఆడుతా ఆంధ్రాకు.. టీమిండియా క్రికెటర్ పొలిటికల్ సంచలన వ్యాఖ్యలు
X

ఏపీలో ప్రభుత్వాలతో పాటే అన్నీ మారిపోతున్నాయి. వైసీపీ సర్కారు హయాంలో ఏదో విధంగా ఇబ్బందికి గురైన వారు గళం ఎత్తుతున్నారు. వీరి జాబితాలో తాజాగా టీమిండియా క్రికెటర్ ఒకరు చేరారు. గతంలో వైసీపీ సర్కారు ‘ఆడుదాం ఆంధ్రా’ అంటూ కార్యక్రమం చేపట్టినా.. 'నేడు ఆడను ఆంధ్రా’కు అంటూ వెళ్లిపోయిన ఆ క్రికెటర్ మనసు మార్చుకున్నాడు. 'ఆడుతా ఆంధ్రాకు’ అంటూ వచ్చేశాడు.

ఏపీలోని కాకినాడకు చెందిన గాదె హనుమ విహారి ప్రతిభావంతుడైన క్రికెటర్. దేశవాళీల్లో 50 పైగా సగటుతో నిలకడగా రాణించిన బ్యాట్స్ మన్. దీంతోనే టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా లో 2012లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని ఏకైక తెలుగు ఆటగాడు కూడా. 2018 సెప్టెంబరులో ఇంగ్లండ్ పై టెస్టు అరంగేట్రం చేశాడు. భారత్ కు 16 టెస్టులు ఆడాడు. 839 పరుగులు చేశాడు. 5 వికెట్లు కూడా తీశాడు. రంజీల్లో హైదరాబాద్, ఆంధ్రా రెండు జట్లకూ ప్రాతినిధ్య వహించాడు. గత సీజన్ లో ఆంధ్రాకు మారిన అతడు కెప్టెన్ గా వ్యవహరించాడు. చివరి ఐదు మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీలు సహా ఓ సెంచరీ కొట్టాడు. కానీ, అనూహ్యంగా గత ఫిబ్రవరిలో వార్తల్లో నిలిచాడు. ఏపీలో అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ నాయకుడి కొడుకు విషయంలో విహారి తీవ్రంగా ప్రవర్తించడంతో వివాదం రేగింది. వైసీపీ నేతలు చెప్పినవారిని జట్టులో చేర్చుకోలేదని అప్పటి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) పెద్దలు తనపై కుట్ర పన్నారని ధ్వజమెత్తాడు. దీంతో భవిష్యత్తులో ఆంధ్రాకు ఆడను అంటూ మీడియాకు ప్రకటన విడుదల చేశాడు. ఇది రాజకీయంగా పెను దుమారం రేపింది.

మనసు మార్చుకుని..

హనుమ విహారి మంగళవారం ఏపీ మంత్రి నారా లోకేశ్‌ తో భేటీ అయ్యాడు. మళ్లీ ఆంధ్రాకు ఆడతానని స్పష్టం చేశాడు. గత ప్రభుత్వంలో జరిగిన అవమానాలను లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లానని.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)తో ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పాడు. గతంలో ఆంధ్రా జట్టును ఆరుసార్లు సెమీస్‌ కు తీసుకెళ్లానని పేర్కొన్నాడు. అంతేకాక.. గత ప్రభుత్వం తన ప్రతిభను తొక్కేసిందంటూ మండిపడ్డాడు. తాము చెప్పినవారిని జట్టులో చేర్చుకోలేదని అప్పటి ఏసీఏ పెద్దలు కుట్ర పన్నారని.. తానుంటే వాళ్లకు ఇబ్బందని భావించారని ధ్వజమెత్తాడు. ఏపీ వాడిని అయినప్పటికీ గత పాలకులు తనను ఇబ్బందులు పెట్టారని ఆరోపించాడు. దీంతో నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కూడా తీసుకున్నట్లు తెలిపాడు. కాగా, విహారి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ను కూడా కలిశాడు. లోకేశ్ ను సచివాలయంలో కలవగా.. పవన్ కోసం విహారి జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లాడు. వైసీపీ హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించాడు.

రాజకీయాల్లోకి వస్తాడా?

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బాహటంగానే విమర్శలు గుప్పించిన విహారి.. ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు తెలిపాడు. కూటమి విజయానంతరం సోషల్ మీడియా వేదికగా స్వరాన్ని పెంచాడు. ఓ రాజకీయ నాయకుడి తరహాలోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. దీంతో 30 ఏళ్ల విహారి రాజకీయాల్లోకి వెళ్తాడా అన్న అంచనాలు వస్తున్నాయి. అందులోనూ విహారికి పవన్ కల్యాణ్ అంటే అభిమానం.