ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా కె.విజయానంద్ నియమితులయ్యారు. కొత్త సీఎస్ గా విజయానంద్ పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసిన వెంటనే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శ సురేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
By: Tupaki Desk | 30 Dec 2024 10:37 AM GMTఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా కె.విజయానంద్ నియమితులయ్యారు. కొత్త సీఎస్ గా విజయానంద్ పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసిన వెంటనే సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శ సురేశ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారంతో ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పూర్తికానుంది. ఆయన స్థానంలో సీఎస్ పోస్టుకు ముగ్గురు అధికారులు పోటీ పడినా, సీఎం చంద్రబాబు మాత్రం విజయానందుకే అవకాశమిచ్చారు. విజయానంద్ తోపాటు సీఎస్ పోస్టుకు ప్రధాన పోటీదారుగా భావించిన సాయిప్రసాద్ కు విజయానంద్ రిటైర్మెంట్ తర్వాత అవకాశమివ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
సీఎస్ గా విజయానంద్ నియామకంపై ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు సీఎం చంద్రబాబు తన నివాసంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు విజయానంద్, సాయిప్రసాద్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇద్దరూ సీనియర్లే అయినప్పటికీ విజయానంద్ కు సర్వీసు మరో ఏడాదిలో ముగియనుండటం, సాయిప్రసాద్ కు ఇంకా సమయం ఉండటంతో ప్రత్యేక పరిస్థితుల్లో విజయానంద్ కు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. ఇద్దరు రాష్ట్రం అభివృద్ధి చెందేలా పనిచేయాలని సీఎం కోరారు. సీనియర్ ఐఏఎస్ ల సహాయ, సహకరాలు ప్రభుత్వానికి చాలా అవసరమని కోరారు.
ఉమ్మడి కడప జిల్లాకు చెందిన విజయానంద్ బీసీ వర్గానికి చెందిన వారు. 1992 ఐఏఎస్ బ్యాచుకి చెందిన ఆయన ఉమ్మడి ఏపీలో కీలక పోస్టుల్లో పనిచేశారు. 1993లో తొలుత ఆదిలాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టరుగా తొలి పోస్టింగ్ తీసుకున్న ఆయన 1996లో రంపచోడవరం సబ్ కలెక్టరుగా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేశారు. 1997 నుంచి 2007 వరకు ఉమ్మడి ఏపీలోని నల్లొండ, శ్రీకాకుళం కలెక్టరుగా పనిచేశారు. శ్రీకాకుళం కలెక్టరుగా ఉండగా, ఆయన ఓ పార్కును ఏర్పాటు చేశారు. ఆయన సేవలకు గుర్తుగా శ్రీకాకుళం మున్సిపాలిటీ ఆ పార్కుకు విజయానంద్ పార్కుగా నామకరణం చేసింది. 2016 నుంచి 2019 వరకు ఐపీ అండ్ ఎలక్ట్రానిక్స్ ముఖ్యకార్యదర్శిగా 2019 నుంచి 2021 వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
2022లో ఏపీ జెన్కో చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన విజయానంద్ 2023లో ఏపీ ట్రాన్స్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేశారు. విద్యుత్ రంగంలో విశేష అనుభవం ఉన్న విజయానంద్ సూచనలు సలహాలు ఏపీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ రంగం పురోగతికి దోహదపడ్డాయని చెబుతారు.