Begin typing your search above and press return to search.

కడప వ్యక్తికే ఏపీ సీఎస్ పట్టం కట్టిన చంద్రబాబు!

సామాజిక లెక్కలు ఉంటాయి. ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను ఎంపిక చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 4:17 AM GMT
కడప వ్యక్తికే ఏపీ సీఎస్ పట్టం కట్టిన చంద్రబాబు!
X

అత్యంత కీలక పదవిని ఉత్తినే డిసైడ్ చేయరు. ఎన్నో వడపోతలు.. సామాజిక లెక్కలు ఉంటాయి. ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను ఎంపిక చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ కొత్త సీఎస్ ఎంపిక గురించి కొద్ది రోజులుగా భారీ చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పరిశీలనకు తొమ్మిది మంది ఐఏఎస్ పేర్లు వచ్చాయి. ఈ కీలక పదవిని కట్టబెట్టేందుకు భారీ కసరత్తు జరిగింది.చివరకు కడప జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ విజయానంద్ కు పదవిని కట్టబెట్టేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రాత్రి కూటమి సర్కారు అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. దీంతో.. ఏపీ తదుపరి సీఎస్ ఎవరన్న అంశంపై ఆసక్తికర చర్చకు పుల్ స్టాప్ పడినట్లైంది.

ఇంతకూ విజయానంద్ నే ఎందుకు ఎంపిక చేశారు? అన్నది ప్రశ్న. అదే సమయంలో సీఎస్ రేసులో నిలిచిన మిగిలిన వారెవరు? వారిలో తీవ్రమైన పోటీని ఇచ్చినప్పటికి.. పదవిని ఎందుకు సొంతం చేసుకోలేకపోయారు? అన్నది ఆసక్తికర ప్రశ్నగా మారింది. ఇక.. తాజాగా ఎంపికైన విజయానంద్ ఎలాంటి వారు? ఆయనకున్న ఇమేజ్ ఎలాంటిది? ఆయనీ పదవిలో ఎంత కాలం ఉండనున్నారు? ఏ అంశాలు ఆయన్ను సీఎస్ గా ఎంపిక చేయటానికి కారణంగా మారాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

ఏపీ కొత్త సీఎస్ గా ఎంపిక చేసే సమయంలో పలు పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ.. ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య తీవ్రమైన పోటీ సాగింది. వారిలో ఒకరు 1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ కాగా.. మరొకరు 1991 బ్యాచ్ కు చెందిన జీ సాయి ప్రసాద్. ఈ ఇద్దరి మధ్య పోటీలో చివరకు విజయానంద్ పదవిని దక్కించుకున్నారు. ఆయన వచ్చే ఏడాది నవంబరు వరకు సీఎస్ గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర సీఎస్ గా వ్యవహరిస్తున్న నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ కు చెందిన వారన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే ఎక్స్ టెన్షన్ లో ఉన్నారు. కొత్త సీఎస్ జనవరి 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

సీనియార్టీ ప్రకారం చూస్తే.. 1988 బ్యాచ్ కు చెందిన శ్రీలక్ష్మి.. 1990బ్యాచ్ కు చెందిన అనంతరాము.. 1991 బ్యాచ్ కు చెందిన జీ సాయి ప్రసాద్.. అజయ్ జైన్.. సుమితా దవ్రా.. ఆర్ పీ సిసోడియా.. 1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ లు రేసులో నిలిచారు. ఈ జాబితాను షార్ట్ లిస్టు చేయగా.. విజయానంద్.. సాయి ప్రసాద్ ల మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే.. సాయి ప్రసాద్ కు 2026 మే వరకు పదవీ కాలం ఉండటం.. ఆయన్ను ఎంపిక చేస్తే విజయానంద్ కు అవకాశం మిస్ అవుతుందన్న కారణంగా.. చంద్రబాబు తాజా నిర్ణయం తీసుకొన్నట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు.. విజయానంద్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి కావటం.. రాజకీయంగా కూడా కలిసి వస్తుందన్న ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. బీసీ సామాజిక వర్గానికి (యాదవ) చెందిన విజయానంద్ ఎంపిక ద్వారా బీసీలకు పెద్దపీట వేసిన సంకేతాల్ని పంపినట్లు అవుతుందని భావించినట్లుగా తెలుస్తోంది. విజయానంద్ తర్వాత వచ్చే ఏడాది కమ్మ సామాజిక వర్గానికి చెందిన సాయి ప్రసాద్ కు అవకాశం ఇస్తే.. ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లకు సీఎస్ గా అవకాశం కల్పించినట్లు అవుతుందన్న భావనతో.. చంద్రబాబు విజయానంద్ కు టిక్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది.

నిజానికి సీనియార్టీ విషయానికి వస్తే 1990 బ్యాచ్ కు చెందిన అనంతరాముకు సీఎస్ పదవిని కట్టబెట్టాల్సి ఉన్నప్పటికి.. ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు కావటంతో.. రేసులో ఆయన పేరు వెనక్కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. 1991 బ్యాచ్ కు చెందిన సుమితా దావ్రాకేంద్ర సర్వీసుల్లో ఉన్న కారణంగా ఆ పేరును సీఎస్ పదవికి పరిశీలించలేదన్నది సమాచారం. తాజాగా ఎంపికైన విజయానంద్ విషయానికి వస్తే.. ఎలాంటి వివాదాలకు అవకాశం లేని విధంగా ఆయన కెరీర్ నడిచిందని చెబుతారు.

1992 బ్యాచ్ కు చెందిన ఆయన 1993లో కెరీర్ షురూ అయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ కలెక్టర్.. రంపచోడవరం సబ్ కలెక్టర్.. .శ్రీకాకుళం కలెక్టర్ తో పాటు ఏపీ జెన్ కో ఎండీ.. ఏపీ ట్రాన్స్ కో సీఎండీగా 2016-19 వరకు కొనసాగారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ కార్యదర్శిగా.. ఇంధనం స్పెషల్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు అవకాశం లేని రీతిలో సాగిన విజయానంద్ ఎంపికతో అన్ని వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమవుతుందన్న ఉద్దేశంతోనే ఆయన వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు.