హిందీ వివాదం.. పిల్లల కొట్లాట.. టీవీకే విజయ్ తప్పులో కాలు?
ఒకవైపు తన పార్టీనే టార్గెట్ చేస్తూ స్టాలిన్ పన్నుతున్న వ్యూహాన్ని అర్థం చేసుకున్నారో లేదో కానీ.. హిందీ వివాదంపై విజయ్ నోరు విప్పారు.
By: Tupaki Desk | 26 Feb 2025 9:55 AM GMT‘‘హిందీని మా మీద రుద్దొద్దు’’ మెజారిటీ తమిళనాడు ప్రజల దశాబ్దాల నినాదం ఇది. ఇలాంటి సమయంలోనే త్రిభాషా సూత్రం, నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)ను చూపుతూ అధికార డీఎంకే పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తోంది. జనాభా నియంత్రణకు పాటుపడిన దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ సీట్లను కోల్పోతున్నాయంటూ విమర్శలకు దిగుతోంది. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ రంగంలోకి దిగి కేంద్రాన్ని సవాల్ చేస్తున్నారు. దీనివెనుక ఆయన రాజకీయ ఎత్తుగడలు చాలా ఉంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ప్రముఖ హీరో విజయ్ స్థాపించిన కొత్త పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారు.
ఒకవైపు తన పార్టీనే టార్గెట్ చేస్తూ స్టాలిన్ పన్నుతున్న వ్యూహాన్ని అర్థం చేసుకున్నారో లేదో కానీ.. హిందీ వివాదంపై విజయ్ నోరు విప్పారు. అయితే, అది తమిళ ప్రజల భావాలకు వ్యతిరేకంగా ఉండడం గమనార్హం. ఓవైపు డీఎంకే-కేంద్రం మధ్య ఢీ అంటే ఢీ అంటూ వివాదం సాగుతుండగా.. విజయ్ స్పందించిన తీరు కాస్త భిన్నంగా ఉంది.
డీఎంకే.. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వాల మధ్య హిందీ విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిని చిన్నపిల్లల కొట్లాట అంటూ విజయ్ ఎద్దేవా చేశారు.
గత ఏడాది ఫిబ్రవరి 2న పార్టీని స్థాపించిన విజయ్.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు టీవీకే తొలి ర్షికోత్సవం సందర్భంగా హిందీ వివాదంపై ఆయన మాట్లాడారు. డీఎంకే, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘కొత్త విద్యా విధానం (ఎన్ఈపీ), త్రిభాషా సూత్రం అమలుపై డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీన్ని ఒక రంగస్థలంగా మార్చారు. ఆ రెండూ పెద్ద పార్టీలైనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో హ్యాష్ ట్యాగ్ గేమ్స్ ఆడుకుంటున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది చిన్నపిల్లల కొట్లాటలా ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ త్రిభాషా విధానాన్ని డీఎంకే లాగానే విజయ్ కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే, త్రిభాషా సూత్రం అమలును అంగీకరించకపోతే.. తమిళనాడుకు రావాల్సిన రూ.2,400 కోట్లను ఆపేస్తామంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసినట్లు వచ్చిన వ్యాఖ్యలపై విజయ్ స్పందించారు. కేంద్రం తీరును తప్పుబడుతూనే బీజేపీ, డీఎంకే రెండూ నిజాయతీ లేని పార్టీలని దుయ్యబట్టారు. వారిని దించేయాలని.. ‘గెట్ ఔట్’ హ్యాష్ ట్యాగ్ పెట్టి సాగనాపడమే లక్ష్యంగా కృషి చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. టీవీకే ఎన్నికల వ్యూహకర్తగా ప్రముఖ సెఫాలజిస్టు ప్రశాంత్ కిశోర్ నియామకానికి ప్రయత్నించారనే కథనాలు వచ్చాయి. టీవీకేకు పీకే ప్రత్యేక సలహాదారుగా వస్తారంటూ ప్రచారం జరిగింది. దీనికితగ్గట్లే విజయ్ పార్టీ కార్యక్రమానికి ప్రశాంత్ కిశోర్ హాజరయ్యారు. ఆయనతో కలిసి విజయ్ వేదిక పంచుకొని.. ప్రజలకు అభివాదం చేశారు. దీంతో పీకే టీవీకే ప్రత్యేక సలహాదారు అనేది తేలిపోయింది.