Begin typing your search above and press return to search.

జన సునామీ : స్టాలిన్ ని కంగారు పెట్టిన విజయ్ తొలి సభ

ఏకంగా ఎనిమిది లక్షల మంది దాకా పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలి వచ్చారు.

By:  Tupaki Desk   |   28 Oct 2024 4:23 AM GMT
జన సునామీ : స్టాలిన్ ని కంగారు పెట్టిన విజయ్ తొలి సభ
X

తమిళ సూపర్ స్టార్ విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థాపించిన తమిళ వెట్రి కళగమ్ పార్టీ తొలి మహా సభను ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవండి వద్ద ఏర్పాటు చేస్తే జన సునామీ అక్కడ కనిపించింది. ఏకంగా ఎనిమిది లక్షల మంది దాకా పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలి వచ్చారు. రాజకీయ సభలలో ఇది ఒక రికార్డుగా మారిందని అంటున్నారు.

విజయ్ తొలి సభతోనే ప్రత్యర్థుల గుండెలలో దడ పుట్టించారు. ఆయన ప్రసంగం కూడా సూటిగానే ఉంది. తనకు ప్రత్యర్ధులు ఎవరు, తన పార్టీ ఫిలాసఫీకి ఎవరు అసలైన శత్రువులు అన్నది ఆయన పక్కా క్లారిటీతో వివరించారు. బీఅజేపీని తన సైద్ధాంతిక ప్రత్యర్ధిగా ఆయన అభివర్ణించారు. అదే సమయంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తమకు అసలు సిసలు రాజకీయ ప్రత్యర్ధి అన్నారు. సమాజంలో చిచ్చు పెట్టి విభజించే వారు అంతా తమ పార్టీకి ఆగర్భ శత్రువులు అని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. తమిళనాడుని కుటుంబ వ్యాపార సంస్థగా మార్చేశారు అంటూ డైరెక్ట్ గా డీఎంకే మీద విజయ్ దాడి చేశారు.

డీఎంకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పార్టీ అని ఆయన కుండబద్దలు కొట్టేశారు. తమిళనాడు రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆ మార్పుతోనే తమిళనాడు సమాజం బాగుపడుతుందని అన్నారు.

ఆ దిశగానే తమ అడుగులు పడతాయని అన్నారు. తాను సినిమాల్లో సూపర్ స్టార్ గా ఉంటూ మంచి క్రేజ్ ఉన్న టైం లో పార్టీ పెట్టి వచ్చాను అంటేనే రాజకీయాల పట్ల మక్కువతో ప్రజల పట్ల అభిమానంతో అని ఆయన స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు కొత్త కావచ్చు కానీ ప్రజల మేలు చేసే విషయంలో తన నిబద్ధతను ఎవరూ తప్పు పట్టలేరని అక్కడ తనకు కొత్త ఏమీ లేదని అన్నారు

సినీ నటులను తేలికగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఒక ఎన్టీఆర్, ఒక ఎంజీయార్ సినీ నటులుగా ఉంటూ రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించారు అని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతే కాదు ఎన్టీఆర్ తెలుగు నాట చెరగని ముద్ర వేశారు అని కూడా అన్నారు

తాను కూడా వారి మాదిరిగానే ప్రజలకు సేవ చేస్తాను అన్నారు. ఇక ఈ సందర్భంగా ద్రవిడ స్ఫూర్తి ప్రదాత పెరియార్, మాజీ సీఎం కామరాజ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాణి వేలు నచ్చియార్, అంజలి అమ్మాళ్ ల అడుగుజాడల్లో నడుస్తామని విజయ్ ఈ సభలో ప్రతిజ్ఞ చేశారు. అయితే ఆయన పెరియార్ ని ఒక విషయంలో విభేదించారు. పెరియార్ దేవుడిని నమ్మరు అని తాను నమ్ముతాను అని చెప్పారు.

ఇక తన పార్టీ ఒంటరిగా వస్తుందని ఎవరితోనూ రాజీ అన్నదే లేదని విజయ్ తేల్చేశారు. అంతే కాదు తమ పార్టీ ఎవరికీ ఏ టీం కానీ బీ టీం కానీ కాదని అన్నారు. మొత్తానికి విజయ్ తన పార్టీ 2026 ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించారు.

ఒక విధంగా చెప్పాలి అంటే అధికార డీఎంకేకి పెను సవాల్ గా విజయ్ పార్టీ ఉందని అంటున్నారు. ఆరంభమే అదిరిపోయింది. విజయ్ పట్ల అభిమానంతో జన సునామీ కనిపించింది. ఆయన ప్రసంగంలో క్లారిటీ ఉంది. ఆయన ఫోకస్ కూడా కచ్చితంగా ఉంది. ఆయన తమిళనాడులో కొత్త రాజకీయాన్ని తెస్తానని అంటున్నారు.

తమిళనాడులో ప్రస్తుతం చూస్తే రాజకీయ శూన్యత ఉంది. ఒకసారి డీఎంకేకు అధికారం ఇస్తే మరోసారి అన్నా డీఎంకేకి జనాలు ఇస్తారు. అయితే అన్నా డీఎంకే వీక్ గా ఉంది. మరే ఇతర పార్టీ పోటీలో అంతగా ముందుకు రావడం లేదు. దాంతో విజయ్ పార్టీ బలంగా మారితే మాత్రం డీఎంకేకి అది భారీ రాజకీయ ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

ఒక విధంగా ప్రజలు కనుక విజయ్ పార్టీని ఇష్టపడితే డీఎంకేకి అధికారం కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది అని విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా విజయ్ స్పీచ్ అయితే సూపర్ అంటున్నారు. వచ్చిన జనాలు కూడా కాబోయే సీఎం విజయ్ అంటున్నారు. మరి విజయ్ ఏపీలో పవన్ మాదిరిగా తొలి ఎన్నికల్లో ఓటమి పాలు అవుతారా ఎన్టీఆర్ లా సీఎం అవుతారా అన్నది చూడాల్సి ఉంది.