Begin typing your search above and press return to search.

అన్నా యూనివర్శిటీలో అత్యాచారం... మహిళలకు విజయ్ సంచలన లేఖ!

చెన్నై అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివే ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Dec 2024 5:56 AM GMT
అన్నా యూనివర్శిటీలో అత్యాచారం... మహిళలకు విజయ్ సంచలన లేఖ!
X

తమిళనాడు రాజధాని చెన్నై అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివే ఓ విద్యార్థినిపై ఇటీవల కొందరు రాక్షసులు సామూహిక అత్యాచారం జరిపిన సంగతి తెలిసిందే! ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపింది. ఈ సమయంలో హీరో విజయ్ స్పందించారు. సంచలన లేఖ రాశారు!

అవును... చెన్నై అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివే ఓ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో విపక్షాల నుంచి డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో టీవీకే అధినేత, నటుడు, తళపతి విజయ్ స్పందిస్తూ.. ప్రజలకు ఓ లేఖ రాశారు!

తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్.. తమిళనాడులో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్వదస్తూరితో ఓ లేఖ రాశారు! ఈ సందర్భంగా... తమిళనాడులో మహిళల భద్రత గురించి ఎవరిని అడగాలంటూ ప్రశ్నించారు. పార్టీ అధికారిక లెటర్ హెడ్ పై విజయ్ చేతి రాతతో రాసిన లేఖలో... "ప్రియమైన సోదరీమణులు" అని సంభోధించి మొదలుపెట్టారు.

"మీ భద్రత గురించి మేము ఎవరిని ప్రశ్నించాలి? మనల్ని పాలించే వాళ్లను ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం లేదని తెలిసింది.. అందుకే ఈ లేఖ రాస్తున్నా" అని విజయ్ తెలిపారు. తమిళనాడులోని విద్యాసంస్థలతో సహా ప్రతీ రోజూ ఏదో ఓ మూల మహిళలు సామూహిక దౌర్జన్యాలకు, లైంగిక నేరాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు!

ఈ విషయాలపై తమ సోదరుడిగా తాను డిప్రెషన్ కు గురవుతున్నానని.. చెప్పుకోలేనంత బాధను అనుభవిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా... ఎలాంటి సమస్యలు వచ్చినా అందరికీ సోదరుడిలా ఉండగా ఉంటానని విజయ్ హామీ ఇచ్చారు. దేని గురించీ చింతించకుండా.. మీ చదువులపై దృష్టి పెట్టండి అని విజయ్ సూచించారు.

ఇదే సమయంలో... సురక్షితమైన తమిళనాడును సృష్టిస్తామని.. అంతా కలిసి త్వరలో దానిని నిర్ధారిస్తామని విజయ్ లేఖలో స్పష్టం చేశారు! ఇప్పుడు ఈ లేఖ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

కాగా... చెన్నై అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివే విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు.. బాధితురాలికి రూ.25 లక్షలు నష్ట పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులతో ‘సిట్’ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా బాధితురాలి విషయంలో తీసుకోవాల్సిన మరికొన్ని జాగ్రత్తల గురించి కూడా న్యాయస్థానం స్పందించింది. బాధితురాలి వద్ద నుంచి ఫీజు తీసుకోవద్దని యూనివర్సిటీకి కూడా స్పష్టం చేసింది. ఆమె చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని వివరించింది.