విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అంబటి రాంబాబు రియాక్షన్ ఇదే!
విజయసాయిరెడ్డి ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 March 2025 5:27 PM ISTవిజయసాయిరెడ్డి ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన... ద్వితీయశ్రేణి నాయకులు కొంతమంది తనకు, జగన్ కు మధ్య అభిప్రాయబేధాలు సృష్టించి, ఆయన మనసు విరిచేశారని.. జగన్ కు తనకు మధ్య ఆయన కోటరీ అడ్డుగా నిలిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారగా.. ప్రధానంగా వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది జగమెరిగిన సత్యమే కదా అనే చర్చ వైసీపీ వర్గాల్లో నడిచిందనే కామెంట్లు వినిపించాయి. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎవరి స్థాయిలో వారు, ఎవరి స్టైల్లో వారు స్పందించారు. ఈ సమయంలో అంబటి రాంబాబు ఆసక్తికర సూచన చేశారు.
అవును... రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను.. ఇకపై వ్యవసాయం చేసుకుంటాను అంటూ ప్రకటించిన వైసీపీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డి.. తాజాగా జగన్ పై పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా "కోటరీ" అనే కామెంట్లు చేశారు. అయితే నిన్నమొన్నటివరకూ సాయిరెడ్డి కూడా జగన్ కోటరీలో ఒకరనే చర్చ జరిగిన వేళ.. ఈ కామెంట్లు షాకింగ్ గా అనిపించాయని అంటున్నారు.
ఇదే విషయాన్ని మాజీ మంత్రి అమర్నాథ్ చెప్పకనే చెప్పారు! ఈ నేపథ్యంలో తాజాగా మాజీమంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు స్పందించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నిత్యం జగన్ పక్కన ఉన్నది విజయసాయిరెడ్డే అని గుర్తు చేశారు! జగన్ కు రెండు చెవుల్లోనూ ఇన్ పుట్ ఇచ్చే వ్యక్తి విజయసాయిరెడ్డి అని తెలిపారు.
ఆయన విధేయతకు, శ్రద్ధకు పార్టీలో అనేక పదవులతో ప్రతిఫలం పొందారని.. ఇంతకాలం జగన్ కు ఏకైక కోటరీగా పనిచేసిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని తెలిపారు! ఈ క్రమంలో తాజాగా సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఉద్దేశ్యం మాజీ బాస్ పై బురద జల్లడమేనని తెలిపారు! ఈ సందర్భంగా మీడియాకు అంబటి రాంబాబు ఓ సూచన చేశారు.
ఇందులో భాగంగా... విజయసాయిరెడ్డిని సీరియస్ గా తీసుకోవద్దని మీడియాను అంబటి రాంబాబు కోరారు. కాగా... సాయిరెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి మొదలైన నేతలు ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. సాయిరెడ్డిని సీరియస్ గా తీసుకోవద్దని అంబటి రాంబాబు సూచించారు!
పోసాని భయపడుతున్నారు!:
గుంటూరు జైల్లో ఉన్న పోసానితో అంబటి రాంబాబు ములాకత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి... పోసానిపై ప్రభుత్వం 17 కేసులు బనాయించిందని తెలిపారు. అయితే.. అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో ఆయనపై సీఐడీ వారు పీటీ వారెంట్ దాఖలు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు.
ఇదే సమయంలో.. పోసానిపై సీఐడీ సెక్షన్ 111 నమోదు చేశారని.. ఆ సెక్షన్ పోసాని కేసుకు వర్తించదని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారని.. మేజిస్ట్రేట్ సైతం సెక్షన్ 111ను తిరస్కరించారని తెలిపారు. మరోపక్క.. జైల్లో పోసాని కృష్ణమురళి భయపడుతున్నారని అంబటి రాంబాబు వెల్లడించారు.
ప్రభుత్వం తనను చంపేస్తుందేమో అని పోసాని ఆవేదన వ్యక్తం చేశారని.. తన కుమారులను ఏమైనా చేస్తారేమోనని ఆయన కంగారు పడుతున్నారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.