'క్యారెక్టర్ ఉన్నవాడిని'... సాయిరెడ్డి నుంచి జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్!
ఇదే సమయంలో... సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా, ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే అని అన్నారు.
By: Tupaki Desk | 7 Feb 2025 7:01 AM GMTగురువారం మీడియా ముందు మాట్లాడిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్.. తన పార్టీని విడిచి వెళ్లినవారి గురించి స్పందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తిగా పేరున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీని వీడటంపై స్పందించారు. ఈ సమయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
ఈ సందర్భంగా స్పందించిన జగన్... తమ రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు అని చెబుతూ... రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలి.. మనంతట మనమె ప్రలోభాలకు లొంగో, భయపడో, రాజీపడో అటువైపు పోతే ఇక మన క్యారెక్టర్, క్రెడిబిలిటీ ఏమిటి? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో... సాయిరెడ్డికైనా, పోయిన ముగ్గురు ఎంపీలకైనా, ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్లకైనా అంతే అని అన్నారు. అనంతరం.. నేడూ వైసీపీ ఉంది అంటే అది వారి వల్ల కాదని.. దానికి కారణం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే అని జగన్ తెలిపారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి నుంచి ఓ ఆసక్తికర ట్వీట్ దర్శనమిచ్చింది.
అవును... ఇటీవల రాజ్యసభ ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నానని.. ఇక తన తదుపరి మజిలీ వ్యవసాయం చేసుకోవడమే అని చెప్పుకొచ్చిన విజయసాయిరెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయంలో జగన్ సీరియస్ గానే ఉన్నారనే చర్చ జరిగింది.
ఈ సమయంలో విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇందులో భాగంగా... "వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే.. ఎవరికి, ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే.. రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా" అని పోస్ట్ చేశారు.
దీంతో... జగన్ చేసిన కామెంట్స్ కి విజయసాయి ఇలా రియాక్ట్ అయ్యారనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో... విజయసాయిరెడ్డి సడన్ అంత పెద్ద కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందనే చర్చా మరోసారి బలంగా మొదలైంది. ఏది ఏమైనా.. సాయిరెడ్డి తాజా ట్వీటు జగన్ కు కౌంటర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.