Begin typing your search above and press return to search.

విజయసాయికి ఏపీ సీఐడీ నోటీసులు.. ఏ కేసులో అంటే?

వైసీపీ ప్రముఖ నేతలు వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత నెక్ట్స్ ఎవరు? అన్న ప్రశ్నకు సినీ నటుడు పోసాని క్రిష్ణమురళిని తెరపైకి తెచ్చి సస్పెన్స్ కు తెరదించింది కూటమి ప్రభుత్వం.

By:  Tupaki Desk   |   11 March 2025 7:00 AM IST
విజయసాయికి ఏపీ సీఐడీ నోటీసులు.. ఏ కేసులో అంటే?
X

కూటమి ప్రభుత్వ వ్యూహాలు అంతుచిక్కడం లేదు. తమ రాజకీయ ప్రత్యర్థులే టార్గెట్ గా ప్రభుత్వ పెద్దలు వేస్తున్న ప్రణాళికలు పొలిటికల్ సర్కిల్స్ ను సైతం షాక్ కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలపై కేసులు నమోదు చేస్తూ, హడలెత్తిస్తున్న ప్రభుత్వం తాజాగా రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయిరెడ్డిపైనా నజర్ ప్రకటించినట్లు కనిపిస్తోందంటున్నారు. కాగినాడు పోర్టు వాటాల బదిలీ విషయంలో విచారణకు హాజరుకావాలంటూ విజయసాయిరెడ్డికి ఏపీ సీఐడీ తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

వైసీపీ ప్రముఖ నేతలు వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత నెక్ట్స్ ఎవరు? అన్న ప్రశ్నకు సినీ నటుడు పోసాని క్రిష్ణమురళిని తెరపైకి తెచ్చి సస్పెన్స్ కు తెరదించింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు పోసాని తర్వాత ఉమ్మడి క్రిష్ణా లేదా రాయలసీమకు చెందిన నేతలు ఉండొచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో ఎవరి ఊహాలకు అందని విధంగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని ముందుకు తెచ్చింది. కాకినాడ సీపోర్టు వాటాలను బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలపై ఆయనపై గత ఏడాది డిసెంబరులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్న విజయసాయిరెడ్డికి తాజాగా సీఐడీ నుంచి పిలుపు వచ్చింది.

కాగినాడు సీపోర్టు యాజమాని కేవీ రావు ఫిర్యాదుతో విజయసాయిరెడ్డి అండ్ బ్యాచ్ పై కేసు నమోదైంది. అయితే ఈ విషయంపై దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేయడంతో కాకినాడ పోర్టు వాటాలు దక్కించుకున్న అరబిందో కంపెనీ, సీపోర్టు వాటాలను వెనక్కి ఇచ్చింది. సమస్య పెద్దల సమక్షంలో రాజీ కుదిరినా, కేసు మాత్రం వాపసు తీసుకోకపోవడంతో సీఐడీ రంగంలోకి దిగింది. వైసీపీ మాజీ నేతకు ఉచ్చు బిగించేలా అడుగులు వేస్తోందని అంటున్నారు. వాస్తవానికి కేసు రాజీ అయిన తర్వాత పోలీసు చర్యలు ఉండవని, విజయసాయి భావించినట్లు చెబుతున్నారు. కానీ, సాంకేతికంగా కేసుకు జీవం ఉండటంతో కూటమి అనూహ్యంగా విజయసాయిని ఎంచుకుందని చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా జుగుప్సాకరమైన భాషను ముందుగా విజయసాయిరెడ్డే ప్రయోగించారని కూటమి నేతలు చెబుతున్నారు. మిగిలిన వారిపై చర్యలు తీసుకుని విజయసాయిని వదిలేస్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతో విజయసాయిని శిక్షించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విజయసాయికి నోటీసులు ఇచ్చిన అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగుగా మారింది. ఇక ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.