భయపడి పారిపోయిన విజయసాయి మళ్ళీ ట్వీట్ నా ?
ఆ మాటకు వస్తే జగన్ లండన్ నుంచి తిరిగి వస్తున్న వేళ ఆయనకు పంపించిన లేఖలోనూ రాజకీయాల గురించే మాట్లాడారు.
By: Tupaki Desk | 2 Feb 2025 4:42 PM GMTవైసీపీలో నంబర్ టూ గా ఉంటూ గడచిన పదిహేనేళ్ళుగా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న మాజీ ఎంపీ వి విజయసాయిరెడ్డికి ఒక్కసారిగా రాజకీయ వైరాగ్యం కమ్ముకుంది. ఆయన తనకు వద్దీ రాజకీయం అని ఒక ఫైన్ మార్నింగ్ అనేసుకున్నారు. అంతే వేగంగా సుదీర్ఘమైన ట్వీట్ కూడా వేశారు.
డేట్ టైం చెప్పి మరీ తన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా ఇచ్చేశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నుంచి ఇక రాజకీయాల గురించి మాట్లాడితే ఒట్టు అని పెద్ద ఒట్టే పెట్టుకున్నారు. కానీ వారం రోజులు కాలేదు ఆయన మళ్ళీ పొలిటికల్ ట్వీట్లు వేస్తున్నారు.
ఆ మాటకు వస్తే జగన్ లండన్ నుంచి తిరిగి వస్తున్న వేళ ఆయనకు పంపించిన లేఖలోనూ రాజకీయాల గురించే మాట్లాడారు. వైసీపీ మళ్ళీ 2029లో అధికారంలోకి రావాలని రాజకీయ వాక్యాలను ఆయన చేర్చడం పట్ల కూడా చర్చ సాగింది. రాజకీయాలు వద్దు అనుకున్న వేళ మళ్ళీ ఈ రాజకీయ ప్రేమలేమిటి అని కూడా అనుకున్నారు.
ఇకపోతే ఇపుడు విజయసాయిరెడ్డి ట్వీట్ లో మరోసారి బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ గురించి ప్రస్తావనను చేయడం పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. ఆయన ఈసారి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ఎత్తి పడేశారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ని వేయి నోళ్ళ కొనియాడారు.
ఈ బడ్జెట్ మిడిల్ క్లాస్ బడ్జెట్ గా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ప్రశంసించడం విశేషం. ఈ బడ్జెట్ ని చూసిన దేశంలోని మధ్యతరగతి వర్గాలు అంతా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నాయని కూడా ఆయన అంటున్నారు. దీంతో విజయసాయిరెడ్డి ట్వీట్ ఇపుడు ఆసక్తికరంగానూ ఆశ్చర్యకరంగానూ ఉందని అంటున్నారు.
ఎందుకంటే బడ్జెట్ గురించి ఆయన ప్రస్తావించడం పైగా భారీ కితాబులు ఇవ్వడం. దీనిని చూసిన వారు రాజకీయాలకు స్వస్తి అన్న తరువాత మళ్ళీ ఈ రకమైన ట్వీట్లు ఎందుకు చేస్తున్నారు అని కూడా చర్చిస్తున్నారు. ఆయన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని పొగుడుతున్నారు అంటే ఆ పార్టీ పట్ల మొగ్గు చూపిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.
నిజానికి విజయసాయిరెడ్డి తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పినపుడు అందులోనే కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు అని కూడా చెప్పుకున్నారు. ఆ తరువాత కూడా మీడియా సమావేశంలో ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఇపుడు చూస్తే ఆయన కేంద్ర బడ్జెట్ బాగుందని అంటున్నారు. ఈ బడ్జెట్ గురించి ఆయన ప్రస్తావించవచ్చు అయితే అందులో కేవలం పొగడ్తలే ఉన్నాయని అంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఒనగూడినది ఏదీ లేదని కూడా గుర్తు చేస్తున్నారు. అలాంటపుడు బడ్జెట్ లో పన్నుల రాయితీ అన్న అంశం గురించ ఆయన ప్రస్తావిస్తూ గొప్ప బడ్జెట్ అని చెప్పడం పైనే అంతా చర్చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా వెనక ఒత్తిళ్ళు ఉండొచ్చు అని ఇప్పటికే వైసీపీకి చెందిన నేతలు చెబుతూ వచ్చారు.
ఇపుడు ఆయన బీజేపీని పొగడం, మళ్ళీ రాజకీయ ట్వీట్లు వేయడం బట్టి చూస్తూంటే రాజీనామా వెనక ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేస్తున్నాను అని ప్రకటించారు కానీ ఆయన ట్విట్టర్ మాత్రం రాజకీయాలను వదలడం లేదు, దీని భావమేమి విజయసాయీ అని నెటిజన్లు అంటున్నారు.