Begin typing your search above and press return to search.

రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని ఆయన అప్పట్లో తెలిపారు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 3:30 PM GMT
రాజకీయాలపై సూపర్‌ స్టార్‌ సంచలన వ్యాఖ్యలు!
X

తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన విజయ్‌ ఈ ఏడాది కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తుందని అందరూ భావించినా పోటీ చేయలేదు. ముందు తమ పార్టీ సంస్థాగతంగా బలపడాల్సి ఉందని.. ఆ తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్‌ తెలిపారు. ఈ క్రమంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని ఆయన అప్పట్లో తెలిపారు.

ప్రస్తుతం విజయ్‌ తన చివరి చిత్రంలో నటించనున్నారు. కొద్ది రోజుల క్రితమై ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. విజయ్‌ 69వ సినిమాగా వస్తున్న ఇందులో ప్రముఖ హీరోయిన్‌ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్‌ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారించనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఇళయదళపతి విజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేరు ప్రఖ్యాతుల కోసమో, కాలయాపన కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. ప్రజలతో మమేకమై వారికి సేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు.

తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండిలో అక్టోబర్‌ 27న జరుగనున్న టీవీకే తొలి మహానాడు సందర్భంగా అక్కడ తాజాగా ముహూర్త స్తంభ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా విజయ్‌ పార్టీ శ్రేణులకు ఓ బహిరంగ లేఖ రాశారు. పార్టీ శ్రేణులంతా పార్టీ తొలి మహానాడు ఎప్పుడు జరుగుతుందా అని నెలల తరబడి వేచి చూశారన్నారు. ఈ నేపథ్యంలో వారిని తాను, తనను వారు కలుసుకునే సమయం ఆసన్నమైందని ఆ లేఖలో వెల్లడించారు.

పార్టీ శ్రేణులతో తన అనుబంధం కుటుంబసభ్యులతో సంబంధం వంటిదని విజయ్‌ భావోద్వేగ లేఖ రాశారు. ఈ మేరకు తాను తొలిసారిగా కార్యకర్తలకు లేఖ రాస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకోసం పాటుపడాలని, వారి సమస్యలు దశాబ్దాల నుంచి ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని తెలిపారు. టీవీకే పార్టీ లక్ష్యాలను వెల్లడించేందుకే ఈ మహానాడును నిర్వహిస్తున్నామని విజయ్‌ స్పష్టం చేశారు.

తనకు రాజకీయాలు తెలుసా అంటూ ప్రశ్నించే వారందరూ ఈ మహానాడు తర్వాత ఆశ్చర్యపోవటం ఖాయమని విజయ్‌ తెలిపారు. కార్యకర్తలంతా బాధ్యత కలిగిన పౌరులుగా ఉండాలని కోరారు. మంచి వ్యక్తులుగా ఉంటే ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మహానాడు జరిగే వరకు పార్టీ కార్యకర్తలంతా క్రమశిక్షణతో సైనికుల్లా మెలగాలని సూచించారు.