Begin typing your search above and press return to search.

పెరియార్ నే అంటావా? నిర్మలపై విరుచుకుపడ్డ విజయ్

తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ప్రముఖ సామాజిక సంస్కర్త పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.

By:  Tupaki Desk   |   13 March 2025 12:14 PM IST
పెరియార్ నే అంటావా? నిర్మలపై విరుచుకుపడ్డ విజయ్
X

తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెరియార్ అంశం ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. పెరియార్ ను ఎవరైనా ఏమైనా అంటే చాలు తమిళ నేతలు, ప్రజలు మీద పడిపోతుంటారు. తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలు ప్రముఖ సామాజిక సంస్కర్త పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. దీనిపై తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ తీవ్రంగా స్పందించారు.

- విజయ్ విమర్శలు

విజయ్ తాజాగా పెరియార్‌ను సమర్థిస్తూ బీజేపీ ప్రభుత్వం పెరియార్‌ను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగిస్తున్నదని అన్నారు. ప్రజల దృష్టిని నేరుగా ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించేందుకు ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయ్ మాట్లాడుతూ పెరియార్ తన కాలానికి మించిన ఆలోచనలతో సామాజిక న్యాయం కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా, బాల్య వివాహాల నిర్మూలన, విధవా వివాహాలకు ప్రోత్సాహం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం, రిజర్వేషన్లకు మద్దతు వంటి విషయాల్లో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. పెరియార్ ఇప్పటికీ ఎందుకు ప్రజల అభిమానాన్ని పొందుతున్నాడో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ అని ఆయన అన్నారు.

- నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై విజయ్ స్పందన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK)పై విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ తమిళాన్ని అవమానించిన వ్యక్తిని దేవుడిగా చూసే విధానం సరికాదని వ్యాఖ్యానించారు. తమిళ భాషపై పెరియార్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆమె ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ డీఎంకే పార్టీ పెరియార్‌ను గౌరవించడం ద్వంద్వ వైఖరి అని వ్యాఖ్యానించారు. తమిళ భాషను తక్కువ అంచనా వేసిన వ్యక్తిని తమ నాయకుడిగా కొనియాడడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యా విధానం (NEP) చుట్టూ తిరుగుతున్న చర్చలు ఈ నేపథ్యంలో మరింత ముదిరాయి. దీనికి విజయ్ కౌంటర్ ఇచ్చారు.

విజయ్ మాట్లాడుతూ "నిజంగా తమిళ భాషపై పెరియార్ చేసిన వ్యాఖ్యలు నిర్మలా సీతారామన్‌కు సమస్యగా ఉంటే, కేంద్ర ప్రభుత్వం తమిళనాడులో మూడు భాషల విధానాన్ని ప్రయోగించడాన్ని ఆపాలని డిమాండ్ చేయాలి" అని కౌంటర్ ఇచ్చారు. ఇది తమిళ ప్రజలకు తగిన విధంగా ప్రభుత్వ విధానాలను అమలు చేయడం అనే విషయాన్ని నిర్మలా సీతారామన్ పరిశీలించాలని సూచించారు. పెరియార్ పేరు తెరపైకి రాగానే జాతీయ బీజేపీ ప్రభుత్వంపై ఉన్న విమర్శలు వెనుకబడతాయి అని విజయ్ అన్నారు. బీజేపీ మళ్లీ అదే విధంగా ఈ అంశాన్ని ఉపయోగిస్తున్నదని ఆయన ఆరోపించారు. పెరియార్ ఇప్పటికీ తమిళ ప్రజల గుండెల్లో ఉన్నాడని, అందుకే ఆయన పేరు వచ్చినప్పుడల్లా ఇలాంటి చర్చలు చెలరేగుతున్నాయని పేర్కొన్నారు.

-తమిళ రాజకీయాల్లో పెరియార్ ప్రభావం

పెరియార్ పేరు రాజకీయంగా ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ వివాదం మరోసారి రుజువు చేసింది. సామాజిక న్యాయం, భాషా గౌరవం, విద్యా విధానాలు వంటి అంశాల్లో తమిళ రాజకీయాలు ఎప్పుడూ మునిగితేలుతుంటాయి. ఈ వివాదం రాజకీయ పార్టీలను మరింత గా రాజేస్తుందా? లేదా ప్రజల్లో మళ్లీ రాజకీయ చర్చలను రగిలిస్తుందా? అనేది చూడాలి.