దళపతి నోట ఎన్టీఆర్ మాట... టీవీకే పార్టీ తొలి సభ "విజయ్"వంతం!
ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) పార్టీని స్థాపించారు.
By: Tupaki Desk | 28 Oct 2024 4:00 AM GMTతమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సందడి మొదలైంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, దళపతి విజయ్ పార్టీ పెడతారనే ఊహాగానాలు సుమారు 10ఏళ్లుగా వచ్చిన వేళ.. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. "తమిళగ వెట్రి కళగం" (టీవీకే) పార్టీని స్థాపించారు.
2026 ఎన్నికల్లో పోటీయే తమ లక్ష్యమని ప్రకటించారు. ఆగస్టు 22న చెన్నైలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆఫీసులో పార్టీ జెండాను ఆవిష్కరించారు.. పార్టీ గీతన్ని ఆలపించారు. అనంతరం భారత ఎన్నికల కమిషన్ టీవీకేని ఆమోదిస్తూ ప్రకటన చేసింది. ఈ సమయంలో తాజాగా విక్రవాండిలో తొలి మానాడు (మహానాడు) సభను నిర్వహించింది.
అవును... టీవీకే పార్తీ తొలి రాష్ట్రస్థాయి మహానాడును విళుపురం జిల్లాలోని విక్రవాండి సమీపంలో ఆదివారం నిర్వహించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కారకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విజయ్ అభిమానులతో సుమారు 10 నుంచి 20 కి.మీ. మేర వాహనాల బారులే కనిపించాయి.
ఈ సందర్భంగా విజయ్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుందనే చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా మైకందుకున్న దళపతి... రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా తమిళగ వెట్రి కళగం మారుతుందని.. అన్ని రాజకీయ మరకల్ని ఉతికి తొలగిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా... తమ సిద్ధాంత నాయకుడు తందై పెరియార్ అని విజయ్ తెలిపారు.
అలాగని ఆయన దైవ నిరాకరణ సిద్ధాంతాని చేతిలోకి తీసుకోబోము కానీ... ప్రధానంగా... మహిళాభ్యున్నతి, స్త్రీ విద్య, సామాజిక న్యాయం, హేతువాదం వంటి పెరియార్ సిద్ధాంతాలను మాత్రం కచ్చితంగా చేతుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అన్నాదురై చెప్పినట్లు ఒకటే కులం, ఒకటే దైవం అనేది తమ వైఖరని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... న్యాయమైన పాలనకు - లౌకికవాదానికీ ఆదర్శంగా ఉన్న మాజీ సీఎం కామరాజర్ ను తమ మార్గదర్శకునిగా స్వీకరిస్తామని.. కులనిర్మూలనకు పోరాడిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను తమ మార్గదర్శకునిగా చెప్పడానికి గర్విస్తున్నామని.. బ్రిటీష్ వారిపై పోరాడిన అంజలై అమ్మాళ్, వేలునాచ్చియార్ లు తమ సిద్ధాంత నాయకులని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించినప్పుడు ముఖానికి రంగులేసుకునేవారంటూ పలువురు విమర్శించారని చెప్పిన విజయ్... తర్వాత ఆ ఇద్దరే తమదైన ప్రజామోద, సంక్షేమ పాలనతో నేటికీ ప్రజా హృదయాల్లో చెరగని స్థానాన్ని పొందారని పేర్కొన్నారు.
ఫైనల్ గా... తమిళగ వెట్రికళగం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దిశ, కొత్త శక్తిగా మారి అన్ని రాజకీయ మరకలను ఉతికి తొలగిస్తుందని దళపతి పేర్కొన్నారు!