‘పిల్లలకు సోషల్ మీడియా నిషేదం’... సాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
By: Tupaki Desk | 30 Nov 2024 5:23 AM GMTచదువుకుంటున్న వయసులో, ఎదుగుతున్న దశలో పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. ఇందులో మంచి కంటే చెడు పాళ్లు చాలా ఎక్కువనే ఆందోళనలు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
అవును... ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని నిర్ణయిమింది. తల్లితండ్రుల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో... దీనికి సంబంధించిన బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.
ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చాలా మంది పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో.. సోషల్ మీడియా విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయన్ని భారతీయులూ స్వాగతిస్తున్నారు. ఇది సరైన నిర్ణయమని, సహేతుకమైన నిర్ణయమని అంటున్నారు. ఈ సమయంలో ఎంపీ సాయిరెడ్డి స్పందించారు.
ఇందులో భాగంగా... 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని ఆస్ట్రేలియా నిషేధించిందని పేర్కొన్న వైసీపీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత విజయ సాయిరెడ్డి.. నిపుణులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సలహా తీసుకున్న తర్వాత భారతదేశంలోనూ ఇలాంటి చట్టాన్ని అమలు చేయడానికి తాను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో... ఇలాంటి నిర్ణయం వల్ల పిల్లల సమయం వృధా కాకుండా ఉండటమే కాకుండా సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కూడా సురక్షితంగా ఉంటారని విజయ సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
కాగా.. ఇదే విషయంపై ఇప్పటికే స్పందించిన జనసేన నేత నాగబాబు... 16 ఏళ్ల లోపు టీనేజర్స్ కి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని.. ఇది ఒక రకంగా బావితరాల బంగారు భవిష్యత్తుకి బాసటగా నిలుస్తుందని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.