సాయిరెడ్డికి ఈడీ నజర్
వీరిద్దరితోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఆడిటింగ్ కంపెనీ ప్రతినిధులకు ఈడీ నోటీసులు పంపింది.
By: Tupaki Desk | 20 Dec 2024 5:28 AM GMTకాకినాడ సెజ్, సీపోర్టులో వాటాల బదిలీ వ్యవహారంపై ఈడీ ఫోకస్ చేసింది. కాకినాడ సీపోర్టు ప్రైవేట్ లిమిటెడ్ (కేసీపీఎల్) చైర్మన్ కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీఆర్) ఫిర్యాదుపై ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా కూపీలాగిన ఈడీ కాకినాడ పోర్టు వాటాల బదిలీలో మనీలాండరింగ్ జరిగిందని ప్రాథమికంగా నిర్థారించింది. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇష్యూలో మాజీ సీఎం జగన్ సోదరుడు వై.విక్రాంత్ రెడ్డి నోటీసులు అందుకున్నారు. వీరిద్దరితోపాటు అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఆడిటింగ్ కంపెనీ ప్రతినిధులకు ఈడీ నోటీసులు పంపింది.
గత ప్రభుత్వంలో తనను బెదిరించి కాకినాడు సీపోర్టు, సెజ్ లో 41 శాతం వాటాలు లాగేసుకున్నారని విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి, శతర్ చంద్రారెడ్డిలపై కేవీఆర్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ ఓ వైపు దర్యాప్తు చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న ఈడీ నిందితులకు నోటీసులిచ్చినట్లు చెబుతున్నారు. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున తాను ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని ఎంపీ విజయసాయిరెడ్డి ఈడీకి లేఖ రాసినట్లు చెబుతున్నారు. అదేవిధంగా అనారోగ్యం పేరుతో విక్రాంత్ రెడ్డి, ముందుగా నిర్ణయించేకున్న పనుల వల్ల తాను రాలేనని శరత్ చంద్రారెడ్డి లేఖ రాసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ ముగ్గురికి మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా సీపోర్టు వాటాల బదిలీతో అంతిమ లబ్ధిదారు అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్లకూ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం.
కాకినాడ సీపోర్టు యజమాని కేవీఆర్ ఫిర్యాదుతో ఇప్పటివరకు ఏపీ సీఐడీ కేసును దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో నిందితులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈడీ కేసులకు, ఇతర క్రిమినల్, సివిల్ కేసులకు చాలా తేడా ఉంటుంది. ఈడీ కేసుల్లో తాము తప్పు చేయలేదని, తమపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని నిందితులు నిరూపించుకోవాల్సివుంటుంది. అదే ఇతర కేసుల్లో అయితే నిందితులు తప్పు చేశారని కేసు పెట్టినవారు ఆధారాలు చూపాల్సివుంటుంది. కాకినాడ పోర్టు వ్యవహారంలో సీఐడీ నుంచి తప్పించుకున్నా, ఈడీ అడిగిన సమాచారానికి కచ్చితమైన జవాబులివ్వాల్సివుంటుంది. నిందితుల వివరణతో ఈడీ సంతృప్తి చెందని పక్షంలో కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉంది.
కాకినాడ సీపోర్టులో రూ.2,500 కోట్ల విలువైన వాటాలను కేవలం రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్లోని రూ,1,109 కోట్ల విలువైన వాటాలను కేవలం రూ.12 కోట్లకు అరబిందో సంస్థ దక్కించుకున్నట్లు ఫిర్యాదు అందింది. దీనిపై సీఐడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. బలవంతంగా బెదిరించి అక్రమంగా వాటాలను దక్కించుకున్నారనే యాంగిల్లో సీఐడీ దర్యాప్తు చేస్తుండగా, దాదాపు రూ.3,500 కోట్ల విలువైన వాటాలను తక్కువ మొత్తానికి ఎలా దక్కించుకున్నారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఏయే మార్గాల ద్వారా సమకూర్చారు అనే అంశాలపై ఈడీ దర్యాప్తు చేయనుంది. మొత్తానికి కాకినాడ సెజ్ విషయంలో ఈడీ రంగంలోకి దిగడంతో నిందితులకు చిక్కులు తప్పేలా లేవని అంటున్నారు.