వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం ఎవరికి?
వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగడంతో ఆయన స్థానంలో ఎవరు? అన్న ప్రశ్న పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 26 Jan 2025 7:30 PM GMTవైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగడంతో ఆయన స్థానంలో ఎవరు? అన్న ప్రశ్న పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలు నడపడంలో విజయసాయిరెడ్డి పాత్ర ఎనలేనిది. ముఖ్యంగా గత ఐదేళ్లు కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహాయ సహకారాలు పొందడంలో విజయసాయిరెడ్డి సక్సెస్ అయ్యారంటారు. దీంతో ఆయన స్థానాన్ని ఎవరికి అప్పగిస్తారని అంతా చర్చించుకుంటున్నారు.
వైసీపీలో ఎందరో కీలక నేతలు ఉన్నారు. కానీ, పార్టీ పరమైన ముఖ్యమైన పనులను అధినేత జగన్ కొందరికే అప్పగిస్తారు. అలాంటి వారిలో విజయసాయిరెడ్డితోపాటు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటివారు ముందుంటారు. రాష్ట్రాన్ని ఐదు ప్రాంతాలుగా విభజించి ఒక్కో చోట ఒక్కొక్కిరిని ఇన్ చార్జిగా నియమిస్తుంటారు. అదేవిధంగా ఢిల్లీ పనుల కోసం ఒకరిని వినియోగించుకుంటారు.
గత ఐదేళ్లలో ఢిల్లీ స్థాయిలో అన్ని పనులను విజయసాయిరెడ్డే చక్కబెట్టేవారు. ఇక ఉత్తరాంధ్రతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఇన్చార్జిగానూ ఆయన పనిచేశారు. ఉత్తరాంధ్ర నుంచి తప్పిస్తే అంతే కీలకమైన ప్రకాశం, నెల్లూరు జిల్లాలను విజయసాయికి అప్పగించడం ఆయన పాత్రను సూచిస్తుంది. అయితే ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచే తప్పుకోవడంతో విజయసాయి రెడ్డి స్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది.
వైసీపీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో జగన్ మినహాయిస్తే మిగిలిన పది మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మిగిలిన వారు ఎవరూ పెద్ద స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే నైపుణ్యం, ఓర్పు, సామర్థ్యం లేవనే టాక్ ఆ పార్టీలో వినిపిస్తోంది. దీంతో ఎంపీల్లో మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డిపైనే ఎక్కువగా భారం పడుతోంది. కేసుల వల్ల అవినాశ్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో జగన్ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. దీంతో తన సన్నిహితుడు, స్నేహితుడు మిథున్ రెడ్డిపైనే జగన్ ఆధారపడతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డి నమ్మిన బంటు. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. జగన్ ఏ పని అప్పగించినా మిథున్ రెడ్డి చిత్తశుద్ధితో పూర్తి చేస్తారనే నమ్మకం ఉంది. ఇక గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీ తుడిచిపెట్టుకుపోయినా, మిథున్ రెడ్డితో సహా ఆయన తండ్రి, బాబాయ్ టీడీపీ హవాను తట్టుకుని గెలవగలిగారు. దీంతో ప్రస్తుత విపత్కర పరిస్థితులను మిథున్ రెడ్డి మాత్రమే అధిగమించగలరని ఆ పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. విజయసాయిరెడ్డి స్థానాన్ని మిథున్ తో భర్తీ చేస్తే బాగుంటందని సూచిస్తున్నారు. మరి మాజీ సీఎం జగన్ ఆలోచన ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.