పవన్ బెస్ట్ అంటున్న విజయసాయి...మర్మమేంటోయి ?
ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు లోకేష్ ల మీద విరుచుకుపడుతూనే అదే సమయంలో పవన్ కళ్యాణ్ ని మెచ్చుకునెలా మాట్లాడారు.
By: Tupaki Desk | 6 Dec 2024 3:55 AM GMTవైసీపీ కీలక నేత ఎంపీ వి విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు. ఆయన మీద పరువు నష్టం దావా వేస్తాను అని కూడా హెచ్చరించారు. దానికి కారణం తన మీద లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినందుకు అని ఆయన ఫైర్ అయ్యారు. తన పరువుకు భంగం కలిగించి తన ఇమేజ్ ని దెబ్బ తీసే విధంగా బాబు వ్యవహరిస్తున్నారు అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. బాబుకు పాలన చేతకాక ఇలాంటివి చేస్తున్నారు అని ఆయన అంటున్నారు.
కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగాయని అంటున్నారని తనను మధ్యలోకి తెచ్చి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడమేంటి అని ఆయన ప్రశ్నించారు. నిజంగా అక్కడ అవినీతి అక్రమాలు బయటపడాలి అంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు లోకేష్ ల మీద విరుచుకుపడుతూనే అదే సమయంలో పవన్ కళ్యాణ్ ని మెచ్చుకునెలా మాట్లాడారు. ఏపీలో పాలన చేయాలీ అంటే బాబు లోకేష్ ల కంటే కూడా పవన్ బెస్ట్ లీడర్ అవుతారు అని కితాబు ఇచ్చారు.
మరి పవన్ ని సడెన్ గా విజయసాయిరెడ్డి ఎందుకు పొగిడారు అన్నదే చర్చనీయాశంగా ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన తాను పవన్ ని విమర్శించకపోవడానికి కారణం ఆయన తనకు మిత్రుడు అని చెప్పారు. ఇపుడు చూస్తే పవన్ బెస్ట్ అంటున్నారు.
దాంతోనే ఇది ఒక వైరల్ గా మారుతోంది. ఏపీలో చూస్తే టీడీపీ కూటమిలో జనసేన ఉంది. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం పంపిణీ జరుగుతోంది అన్నది కూడా పవన్ లేవనెత్తిన ఇష్యూనే. ఆయనే స్వయంగా సముద్రంలోకి వెళ్ళి మరీ అక్కడ షిప్ ని తనిఖీ చేసారు.
మరి పవన్ ఆ విధంగా ఈ విషయంలో సీరియస్ యాక్షన్ కోరుకున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ పెట్టింది. ఇపుడు విజయసాయిరెడ్డి పవన్ బెస్ట్ అంటూ చంద్రబాబు మీద విమర్శలతో ఆడిపోసుకోవడం వెనక ఏ వ్యూహముందని అంటున్నారు.
అయితే బాబుని విమర్శించే క్రమంలోనే అదే కూటమిలో ఉన్న పవన్ మంచి పాలన ఆయన కంటే ఇస్తారు అని విజయసాయిరెడ్డి చెప్పి ఉంటారని అంటున్నారు. ఇక కొస మెరుపుగా తమ అధినేత జగన్ ఇంకా మంచి పాలన ఇస్తారని కూడా విజయసాయిరెడ్డి అన్న మాటనూ గుర్తు చేసుకుంటున్నారు. సో ఆయన అన్న మాటలలో బాబు టీడీపీనే గట్టిగా టార్గెట్ చేశారని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డి నోటి వెంట పవన్ బెస్ట్ అన్న మాట రావడం మాత్రం రాజకీయంగా కొంత సంచలనంగానే ఉంది అని అంటున్నారు.