మమతక్క అయితే జగనన్న జై కొడతారా ?
ఇండియా కూటమి నాయకత్వం కోసం మిత్ర పార్టీల మధ్య హాట్ హాట్ గానే డిస్కషన్ సాగుతోంది.
By: Tupaki Desk | 11 Dec 2024 3:52 AM GMTఇండియా కూటమి నాయకత్వం కోసం మిత్ర పార్టీల మధ్య హాట్ హాట్ గానే డిస్కషన్ సాగుతోంది. బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ అయితే తాను ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు చేపడతాను అని పదే పదే చెబుతున్నారు.
ఆమెకు ఇండియా కూటమిలోని పెద్దలు ఒక్కొక్కరుగా మద్దతు ఇస్తున్నారు. మరాఠ దిగ్గజం శరద్ పవార్ మమత నాయకత్వానికి ఓకే అనేశారు. ఇక ఉత్తర ప్రదేశ్ కి చెందిన సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మొదటి నుంచి మమతా బెనర్జీ ఇండియా కూటమి పగ్గాలు చేపట్టాలని గట్టిగా కోరుకుంటూ వస్తున్నారు.
ఇక మరో సడెన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ఆర్జేడీకి చెందిన అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా మమతా బెనర్జీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించడం భేష్ అని అంటున్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా మమత వైపే ఉన్నారు అని అంటున్నారు.
ఇలా కీలకమైన పార్టీలు అన్నీ మమతకే పెద్దరికం ఇవ్వాలని చూస్తున్న వేళ అనూహ్యంగా ఏపీలో వైసీపీ ఈ విషయం మీద స్పందించింది. రాజ్యసభలో ఆ పార్టీ నేత అయిన వి విజయసాయిరెడ్డి మమతా బెనర్జీకే ఇండియా కూటమి సారథ్య బాధ్యతలు అప్పగించడం బెటర్ అనేశారు.
ఇండియా కూటమిని సరైన దారిలో నడిపించడానికి మమతా బెనర్జీ సరైన నాయకురాలు అని విజయసాయిరెడ్డి కితాబు ఇవ్వడం చూస్తూంటే వైసీపీ పొలిటికల్ స్టాండ్ ఏంటి జాతీయ స్థాయిలో ఆ పార్టీ విధానం ఏంటి అన్నది మరో మారు చర్చకు వస్తోంది.
ఎటూ ఎన్డీయేతో పొత్తు లేదు, పూర్వం బంధాలు అనుబంధాలు లేవు అనే అంటున్నారు. దాంతో జాతీయ స్థాయిలో ఇండియా కూటమితో అడుగులు వేద్దామని అనుకుంటే అక్కడ కాంగ్రెస్ అడ్డు వస్తోంది. కాంగ్రెస్ చేతిలో ఇండియా కూటమి ఉందిపుడు.
అదే చేతులు మారి మమతా బెనర్జీకి పగ్గాలు దక్కితే వైసీపీకి ఓకేనా అన్నట్లుగానే చర్చ సాగుతోంది. మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ ని ధిక్కరించి సొంతంగా పార్టీని పెట్టుకుని ముమ్మారు బెంగాల్ కి సీఎం అయ్యారు. ఆమెతో కలసి పనిచేయడానికి వైసీపీకి అభ్యంతరం ఉండకపోవచ్చు అని అంటున్నారు.
ఇక ఇండియా కూటమిలోకి మమతా బెనర్జీయే వైసీపీని ఆహ్వానిస్తుంది అని అంటున్నారు. అందుకే ముందుగానే బయట ఉన్న వైసీపీ మమతకే బాధ్యతలు ఇవ్వాలని ఫుల్ సపోర్టు ఇచ్చిందని అంటున్నారు. విజయసాయిరెడ్డి అయితే మమతా బెనర్జీ దేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన పశ్చిమ బెంగాల్ కి సీఎం గా మూడు సార్లు పనిచేసి తన సత్తాను నిరూపించుకున్నారు అని కితాబు ఇస్తున్నారు. మరి ఈ మమతానుబంధం అంతా ఇండియా కూటమి వైపు వైసీపీ చూపు సారించేందుకేనా అన్న చర్చ సాగుతోంది.
అయితే తాము తటస్థంగానే ఉంటామని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. మమతా బెనర్జీ విషయంలో తీసుకుంటే వైసీపీకి సాఫ్ట్ కార్నర్ ఉందని అలాగే ఆమె లీడర్ షిప్ అయితే కాంగ్రెస్ ప్రమేయం లేకుండానే ఇండియా కూటమిలోకి వైసీపీకి రెడ్ కార్పెట్ పరచి మరీ ఇన్విటేషన్ వస్తుందని అంటున్నారు. అందుకేనా ఈ విధంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు అంటే జవాబు కాలమే చెప్పాలేమో.