Begin typing your search above and press return to search.

వస్తూ వస్తూ ఆ ఇష్యూనే టచ్ చేశారు!

వస్తూ వస్తూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూనే టచ్ చేశారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని అన్నారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 4:06 AM GMT
వస్తూ వస్తూ ఆ ఇష్యూనే టచ్ చేశారు!
X

వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా మరోసారి ఉత్తరాంధ్రా జిల్లాలలో నియమితులు అయిన రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఆ నియామకం తరువాత తొలిసారి విశాఖలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు.

వస్తూ వస్తూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూనే టచ్ చేశారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని అన్నారు. దాని కోసం తమ పార్టీ తొందరలోనే అమరణదీక్షను చేపడతామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ విషయంలో తాడో పేడో తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనంది ఉత్తరాంధ్రాకు సంబంధించినది. ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో ఉక్కుని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు. ప్రత్యేకించి ఇది ఉత్తరాంధ్రాకు సెంటిమెంట్. అందుకే విజయసాయిరెడ్డి విశాఖ ఉక్కునే టచ్ చేశారు అని అంటున్నారు. రానున్న రోజులలో ఈ ఇష్యూనే బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబునే కార్నరు చేయడానికి ఆయన చూస్తున్నారు. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారని నిప్పులు చెరగడం వెనక ఉద్దేశ్యం కూడా అదే అని అంటున్నారు. అంతే కాదు స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కూడా ఆరోపించారు. దాంతో విశాఖలోనూ ఉత్తరాంధ్రాలో పట్టు కోసం ఉక్కు లాంటి ఇష్యూకే విజయసాయిరెడ్డి గురి పెట్టారని అంటున్నారు.

ఇక రాజకీయ విమర్శలలో భాగంగా టీడీపీ కూటమి పాలనపై 100 రోజుల్లోనే వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని దుయ్యబెట్టారు. తన విషయంలో చెబుతూ దసపల్ల, ఎన్సీసీ భూములతో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధం అని ప్రకటించారు. ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన అంటున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని, పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. దీపావళి తర్వాత రీజినల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన చెబుతూ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసమే రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు మార్పులను వైఎస్ జగన్ చేపట్టారని అన్నారు. మొత్తానికి మళ్ళీ విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రా రాజకీయాలను చేసేందుకు రీ ఎంట్రీ ఇచ్చేశారు. చూడాలి మరి ఫ్యాన్ పార్టీ ఏ విధంగా ముందుకు సాగుతుందో.