Begin typing your search above and press return to search.

సాయిరెడ్డిలో మార్పు.. ఇది గ‌మ‌నించారా?!

వైసీపీలో ఉండ‌గా.. వ్య‌వ‌హ‌రించని స్వేచ్ఛాయుత ప‌రిస్థితి ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. గ‌తానికి ఇప్ప‌టికి సాయిరెడ్డి ముఖ క‌వ‌ళిక‌ల్లోనూ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 9:30 PM GMT
సాయిరెడ్డిలో మార్పు.. ఇది గ‌మ‌నించారా?!
X

వైసీపీ కీల‌క నాయ‌కుడుగా వ్య‌వ‌హ‌రించి.. పార్టీలో నెంబ‌ర్‌-2గా కూడా కొన్నాళ్లు రాణించిన వేణుంబాకం విజ‌య‌సాయిరెడ్డి ఇటీవల ఆ పార్టీకి.. త‌న రాజ్య‌స‌భ స్థానానికి కూడా రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న నిజంగా ఎందుకు పార్టీని, స‌భ‌ను వీడార‌నే విష‌యంపై ఇంకా చ‌ర్చ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే.. సాయిరెడ్డి త‌న ప‌ద‌వులు వ‌దులుకున్నాక‌.. వ్య‌వ‌హ‌రి స్తున్న తీరు చూస్తే.. స్వేచ్ఛ‌కు సంబంధించిన కొన్ని సంకేతాలు వ‌స్తున్నాయి. వైసీపీలో ఉండ‌గా.. వ్య‌వ‌హ‌రించని స్వేచ్ఛాయుత ప‌రిస్థితి ఆయ‌న‌లో క‌నిపిస్తోంది. గ‌తానికి ఇప్ప‌టికి సాయిరెడ్డి ముఖ క‌వ‌ళిక‌ల్లోనూ మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

వైసీపీలో ఉండ‌గా.. జ‌గ‌న్ చెప్పిన‌ట్టు నాయ‌కులు న‌డుచుకునేవారు. త‌న‌కు న‌చ్చ‌నివారిని జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థుల కంటే ఘోరంగా చూసేవారు. దీంతో అలాంటి వారి విష‌యంలో నాయ‌కుల‌కు సానుకూల‌త ఉన్నా.. జ‌గ‌న్‌కు భ‌య‌ప‌డి త‌మ మిత్రులే అయినా.. దూరంగా ఉండేవారు. వాస్త‌వానికి చంద్ర‌బాబు కుటుంబానికి-సాయిరెడ్డి కుటుంబానికి బంధుత్వం ఉంది. ఈ విష‌యాన్ని ఆయ‌నే చెప్పుకొచ్చారు. అయినా.. ఎప్పుడూ దానిని వ్య‌క్తీక‌రించే సాహ‌సం చేయ‌లేక పోయారు. ఎంత‌సేపూ.. రాజ‌కీయాల‌నే చూడాల న్న జ‌గ‌న్ దృక్కోణంలో సాయిరెడ్డి ఉండేవార‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడు ఆ బంధాన్ని, బంధ‌నాల‌ను వ‌దులు కోవ‌డంతో సాయిరెడ్డికి ఫ్రీడం వ‌చ్చింద‌న్న విధంగా క‌నిపిస్తోంది.

తాజాగా సాయిరెడ్డి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌ను కలుసుకున్నారు. ఈ భేటీ వెనుక రాజ‌కీయాలు ఉన్నాయా? మ‌రొక‌టి ఉందా ? అనేది ప‌క్క‌న పెడితే.. మ‌న‌సు విప్పి ఆయ‌న ష‌ర్మిల‌తో మాట్లాడారు. ఇలా.. వైఎస్ త‌న‌య ఇంటికి సాయిరెడ్డి వెళ్ల‌డం అనేది దాదాపు ద‌శాబ్దానికి పైగానే అయిపోయింద‌ని వైసీపీ వ‌ర్గాల్లో గుస గుస వినిపిస్తోంది. పైగా ష‌ర్మిల‌తో భేటీ వ్య‌వ‌హారంపై ఆయ‌న ఇంకా స్పందించ‌లేదంటే.. జ‌గ‌న్‌కు కానీ.. వైసీపీ ఇత‌ర నాయ‌కుల‌కు కూడా ఆయ‌న జంక‌డం లేద‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింద‌ని చెబుతున్నారు. ఇది సాయిరెడ్డిలోనూ ఆత్మ విశ్వాసం పెంచేలా చేసింద‌న్నారు.

అంతేకాదు.. ఆదివారం.. సాయిరెడ్డి నంద‌మూరి కుటుంబంతో స‌ర‌దాగా గ‌డిపారు. దివంగ‌త‌ నంద‌మూరి తార‌క‌ర‌త్న స‌తీమ‌ణి (సాయిరెడ్డికి కుమార్తె వ‌రస‌) అలేఖ్య‌, ఆమె పిల్ల‌ల‌తో సాయిరెడ్డి చాలా చాలా జోష్‌గా క‌నిపించిన ఫొటోలు 'వీకెండ్ విత్ విఎస్ఆర్‌` పేరుతో సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేశాయి. ఈ ఫొటోల్లోనూ సాయిరెడ్డి ముఖంలో సంతోషం, జోష్ వంటి వి కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించాయి. అంటే.. వైసీపీలో ఉండ‌గా.. సాయిరెడ్డిపై ఏదో ఒత్తిడి ఉంద‌ని, అందుకే ఆయ‌న ఇంత జోష్‌గా ఉండ‌లేక పోయార‌న్న విష‌యం తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.